• facebook
  • whatsapp
  • telegram

ఆగస్టులో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌

* కమిషన్‌ వద్ద సిద్ధంగా 1,180 పోస్టులు
* వయో పరిమితి పెంపు కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి
* ఏపీపీఎస్సీ సభ్యుడు సలాంబాబు వెల్లడి

 

 

అమరావతి: జాబ్‌ కేలండర్‌లో ఇప్పటికే ప్రకటించిన పోస్టుల సంఖ్య పెంచుతున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 సహా పలు విభాగాల్లో అదనంగా పోస్టులు జత చేసి వచ్చే నెలలో నోటిఫికేషన్‌ ఇస్తామని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు తెలిపారు. ఇప్పటి వరకు 1180 ఖాళీ పోస్టులను గుర్తించామని, వీటిలో గ్రూప్‌ 1, 2 సహా పలు విభాగాల్లో పోస్టులు ఉన్నట్టు తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులు వివరాలు  రావాల్సి ఉందని, ఇవన్నీ వచ్చాక ఎన్ని పోస్టులు వస్తే అన్ని పెంచి ఆగస్టులో గ్రూప్సు సహా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు.  అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారని, ఇప్పటి వరకు వచ్చిన వినతులను పరిశీలించాలని ప్రభుత్వానికి నోట్‌ పంపినట్టు తెలిపారు.

 

ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వయో పరిమితి పెంపుపై నిర్ణయం తీసకుంటామని వెల్లడించారు. గ్రూప్‌-1 మినహాయించి మిగిలిన ఏ నోటిఫికేషన్‌కూ ఇకపై ప్రిలిమ్స్‌ ఉండదని స్పష్టం చేశారు. ఇకపై ఏపీపీఎస్సీ నియామకాలకు ఒకే పరీక్ష నిర్వహించి, ఇకపై 3-4 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. త్వరగా పోస్టులు భర్తీ చేసేందుకే ప్రిలిమ్స్‌ రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇకపై వచ్చే నోటిఫికేషన్లకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఉద్యోగాల సాధన కోసం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించిన నిరుద్యోగులపై కేసులు ఎత్తివేయాలని నిర్ణయించి ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిపారు. నిరుద్యోగుల భవిష్యత్తుకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకే కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటున్నట్టు సలాంబాబు వివరించారు.

నోటిఫికేషన్ల జారీకి సిద్ధంగా...
రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, అసిస్టెంట్‌ ఇంజినీర్లు 190, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు-గ్రేడ్‌-3 (దేవాదాయ)-60, హార్టికల్చర్‌ ఆఫీసర్‌-39, తెలుగు రిపోర్టర్లు-5, ఇంగ్లిష్‌ రిపోర్టర్లు-10, మెడికల్‌ ఆఫీసర్లు (యూనాని)-26, హోమియో మెడికల్‌ ఆఫీసర్లు-53, ఆయుర్వేద వైద్యులు-72, అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌-9, జిల్లా ప్రజా సంబంధాల అధికారులు-4, ఆయుష్‌ అధ్యాపకులు 27 (హోమియో కళాశాలలకు చెందినవి-24), జూనియర్‌ కళాశాలల లెక్చరర్లు (రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ) 10, డిగ్రీ కళాశాలలో 5 లెక్చరర్ల పోస్టులు చొప్పున ఖాళీ ఉన్నాయి.
మిగులు పోస్టులు
అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు-10, ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్లు-1, అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు-2, ఎక్సటెన్షన్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌-1-ఛైల్డ్‌ వెల్ఫేర్‌) 19, అసిస్టెంట్‌ కమిషనర్లు (దేవాదాయ శాఖ) 3, అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌-5, జూనియర్‌ లెక్చరర్లు (ఇంటర్‌ విద్య)-52, ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌-10, గ్రూప్‌-2- 7, డిగ్రీ కళాశాల అధ్యాపకులు-37, అసిస్టెంట్‌ స్టాటస్టికల్‌ ఆఫీసర్‌-30, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌-28, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌-48+51, గెజిటెడ్‌ పోస్టులు-17, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (సర్వే శాఖ) 06, ఫిషరీస్‌ డెవలప్‌ ఆఫీసర్లు-11, గ్రూప్‌-2 ఉద్యోగాలు 25, మరికొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
 

Posted Date : 16-07-2021