• facebook
  • whatsapp
  • telegram

IT Jobs: బీటెక్‌ రెండో ఏడాదే కొలువు బాట

ఎంపికైన వారికి స్టైపెండ్‌.. ఆ తర్వాత ఆకర్షణీయ వేతనం

ఈనాడు, హైదరాబాద్‌: చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కలల దీపం.. సాఫ్ట్‌వేర్‌ కొలువు. బీటెక్‌ నాలుగో సంవత్సరం ఎప్పుడు పూర్తవుతుంది? మంచి కంపెనీలో ఎన్ని రోజుల్లో ఉద్యోగం వస్తుంది? అన్నదే వారి ఆందోళన.. ఆదుర్దా! కానీ.. ఇదంతా ఒకప్పటి మాట. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల కోసం ఇప్పుడు బీటెక్‌ నాలుగో సంవత్సరంలోకి ప్రవేశించే వరకు కూడా ఆగాల్సిన పనిలేదు. మెరికల్లాంటి ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఐటీ కంపెనీలే కళాశాలలకు వచ్చి, కోర్సు పూర్తవకముందే.. రెండో ఏడాదిలోనే ఎగరేసుకుపోతున్నాయి.ఇంజినీరింగ్‌లో ప్రవేశం పొందుతున్న వందలాది విద్యార్థులు కోర్సులు పూర్తవకుండానే ముందస్తు కొలువులను సొంతం చేసుకుంటున్నారు. బీటెక్‌ రెండో ఏడాదిలోనే వివిధ కంపెనీల ఇంటర్న్‌షిప్‌నకు ఎంపికవుతుండగా.. వారిలో కనీసం 90 శాతం మంది బీటెక్‌ పూర్తయిన వెంటనే ఆయా కంపెనీల్లో శాశ్వత ఉద్యోగాలు దక్కించుకుంటున్నారు. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, సర్వీస్‌ నౌ, ప్రావిడెన్స్‌ తదితర సంస్థలు కొన్ని నెలల క్రితం పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి ఇటీవల ఫలితాలను వెల్లడించాయి. హైదరాబాద్‌లోని 10-15 కళాశాలల విద్యార్థులు వందల సంఖ్యలో ప్రాంగణ నియామకాల ద్వారా ఆయా సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌నకు ఎంపికయ్యారు. పలు సంస్థలు బీటెక్‌ రెండో ఏడాది రెండో సెమిస్టర్‌ విద్యార్థులకు కోడింగ్‌, ఆంగ్లం తదితర పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసుకుంటున్నాయి. వారు మూడో ఏడాదిలో రెండు నుంచి నాలుగు నెలలు ఆయా కంపెనీలకు వెళ్లి ఇంటర్న్‌షిప్‌ చేస్తారు. ఇందుకు కళాశాలలు విద్యార్థులకు హాజరు మినహాయింపును ఇస్తున్నాయి. ఇంటర్న్‌షిప్‌ కాలానికి వివిధ కంపెనీలు నెలకు రూ.30 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు స్టైపెండ్‌ ఇస్తున్నట్లు వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి ప్రాంగణ నియామకాల డైరెక్టర్‌ పార్థసారథి తెలిపారు.
కొన్ని కళాశాలల్లో ఎంపికలు ఇలా..
 ఎంవీఎస్‌ఆర్‌ కళాశాలలో ఇటీవలే మూడో సంవత్సరంలోకి ప్రవేశించిన ముగ్గురు విద్యార్థులు మైక్రోసాఫ్ట్‌ ఎంగేజ్‌ ఇంటర్న్‌షిప్‌నకు ఎంపికయ్యారు. వీరికి నెలకు రూ.1.25 లక్షల చొప్పున స్టైపెండ్‌ అందుతుంది.
 వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి కళాశాలలో 58 మంది విద్యార్థులు బీటెక్‌ రెండో ఏడాదిలోనే ‘జేపీ మోర్గాన్‌’లో ఇంటర్న్‌షిప్‌నకు ఎంపికయ్యారు. వారికి నెలకు రూ.70 వేల స్టైపెండ్‌ అందనుంది. వీరి బీటెక్‌ కోర్సు 2024 మే నాటికి పూర్తవుతుంది.
 వాసవి కళాశాల నుంచి ‘సర్వేస్‌ నౌ సమ్మర్‌’ ఇంటర్న్‌షిప్‌నకు ఎనిమిది మంది ఎంపికవగా.. వారికి నెలకు రూ.70 వేల చొప్పున స్టైపెండ్‌ అందుతుంది. అందులో ఒకరిని చదువు పూర్తయిన తర్వాత ఏడాదికి రూ.33 లక్షలతో కొలువులోకి తీసుకుంటామని ముందే ఆ కంపెనీ చెప్పిందని కళాశాల ప్రాంగణ నియామకాల అధికారి కిశోర్‌ తెలిపారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అన్ని విభాగాలకు సమ ప్రాధాన్యం!

‣ జేఈఈ స్కోరుతో బీటెక్‌ డిగ్రీ, ఆర్మీ కొలువు

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.