• facebook
  • whatsapp
  • telegram

30+30+40 ప్రాతిప‌దిక‌న సీబీఎస్ఈ ఫ‌లితాలు

సుప్రీంకు తెలిపిన బోర్డు

 

 

సీబీఎస్ఈ ప‌న్నెండో త‌ర‌గ‌తి విద్యార్థులకు 30+30+40 ప్రాతిప‌దిక‌న మార్కుల ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు బోర్డు సుప్రీం కోర్టుకు తెలిపింది. ఫ‌లితాల‌పై సుప్రీంలో విచార‌ణ జ‌రిగ్గా.. 12 మంది స‌భ్యుల‌తో కూడిన క‌మిటీ ప్ర‌తిపాదించిన‌ ఫార్ములాను బోర్డు సుప్రీంకు స‌మ‌ర్పించింది. విద్యార్థుల ప‌దో త‌ర‌గ‌తి మార్కుల‌కు 30శాతం వెయిటేజీ, 11వ త‌ర‌గ‌తి మార్కుల‌కు 30శాతం వెయిటేజీ, 12వ‌ త‌ర‌గ‌తిలోని యూనిట్‌, ట‌ర్మ్‌, ప్రాక్టిక‌ల్ మార్కుల‌కు 40శాతం వెయిటేజీ ఉంటుంద‌ని పేర్కొంది. కేటాయించిన మార్కుల‌తో సంతృప్తి చెందని విద్యార్థులకు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని బోర్డు వివ‌రించింది. ఇక ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లకు వంద మార్కులు ఉండ‌గా ఆయా పాఠ‌శాల‌లు వాటిని నిర్ణ‌యించ‌నున్నాయి.

 

జులై 31 నాటికి...
జులై 31నాటికి సీబీఎస్‌ఈ ఫలితాలను ప్రకటించనున్న‌ట్లు భావిస్తున్నట్లు గురువారం కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జూన్‌ మొదటి వారంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పరీక్షల రద్దు నిర్ణయానికి ప్రధాని నరేంద్రమోదీ ఆమోదముద్ర వేశారు. పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అన్న అంశంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలోని మంత్రుల బృందం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకొని విశ్లేషించిన నేపథ్యంలో ఆ వివరాలన్నింటినీ విద్యాశాఖ అధికారులు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. నిర్దేశిత ప్రమాణాలు, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా నిర్దిష్ట గడువులోపు ఫలితాల వెల్లడికి బోర్డు చర్యలు తీసుకోనుంది. పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసుల నమోదు నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని రద్దు నిర్ణయం తీసుకొన్నామని ప్రధాని వెల్లడించారు. 

Posted Date : 17-06-2021