• facebook
  • whatsapp
  • telegram

పాలిసెట్‌ ప్రశ్నపత్రంలో మార్పులు

కంచరపాలెం, న్యూస్‌టుడే: సెప్టెంబ‌రు ఒకటో తేదీన జరగనున్న పాలిసెట్‌ ప్రశ్నపత్రంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు మార్పులు చేసినట్లు ప్రభుత్వ కెమికల్‌ ఇంజినీరింగ్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.వి.రమణ తెలిపారు. ఈ మేరకు అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్‌కు జీఓ జారీచేశారన్నారు. గత ఏడాది వరకు 120 మార్కులకు ఇచ్చిన ప్రశ్నపత్రంలో గణితం 60, ఫిజిక్స్‌ 30, కెమిస్ట్రీకి 30 మార్కులుండేవని అన్నారు. ఈసారి అవే 120 మార్కులకు గణితం 50, ఫిజిక్స్‌ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయన్నారు. గణితంలో 10 మార్కులు తగ్గి ఫిజిక్స్‌లో 10 మార్కులు పెరిగాయన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి ప్రవేశ పరీక్షకు సిద్ధం కావాలని ఆయన తెలిపారు.
పాలిటెక్నిక్‌ విద్యార్థులకు కొత్త సిలబస్‌
పాలిటెక్నిక్‌ విద్యార్థులకు గత ఏడాది సి20 కరిక్యులమ్‌ కొత్త సిలబస్‌ అమల్లోకి వచ్చింది. తొలి ఏడాది విద్యార్థులంతా రెండో ఏడాదిలోకి ప్రవేశిస్తుండడంతో వారికి ఇంగ్లీషు కొత్త సిలబస్‌ కోర్సు మెటీరియల్‌ తయారు చేసే ప్రక్రియ ప్రభుత్వ కెమికల్‌ ఇంజినీరింగ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ, ఉపాధి అధికారిణి బి.సాయిలక్ష్మి, వివిధ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల లెక్చరర్లు ఎస్‌.నిర్మల, ఎల్‌.విజయలక్ష్మి, వి.నరేష్‌కుమార్, కె.సరళాభాయి మెటీరియల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడి కెమికల్‌ కళాశాల విభాగాధిపతులు, లెక్చరర్లు విజయవాడ బయలుదేరి వెళ్లారు. అక్కడి పాలిటెక్నిక్‌ కళాశాలలో వీరంతా కెమికల్‌కు సంబంధించిన మెటీరియల్‌ను సిద్ధం చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.

Posted Date : 04-08-2021