కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళన
రాష్ట్రంలో 40-50 వేల మందిపై ప్రభావం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న మైనార్టీ విద్యార్థుల ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలపై సందిగ్ధం నెలకొంది. ఈ విద్యా సంవత్సరంలో మైనార్టీ సంక్షేమ శాఖకు వచ్చిన ఉపకార వేతనాల దరఖాస్తుల్లో 9, 10 తరగతుల విద్యార్థులవి మాత్రమే పరిష్కరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడమే ఇందుకు కారణం. దీనిపై పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఉపకార వేతనాల కోసం రాష్ట్రంలో 1-10 తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు దాదాపు 1.6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణకు ఈ కోటా కింద కేంద్రం ఏటా 65 వేల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది. ఇందులో 40-50వేలమందిపై ప్రభావం పడనుంది. 1-5 తరగతి విద్యార్థులకు ప్రతి నెలా రూ.100 చొప్పున, 5-10 వరకు విద్యార్థులకు రూ.350 చొప్పున సంవత్సరంలో 10 నెలల పాటు చెల్లిస్తోంది. దీంతో పాటు ఏడాదికి ప్రవేశ ఫీజు కింద రూ.500, పుస్తకాలు, ఇతర ఖర్చుల కింద ప్రతి నెలా మరో రూ.వంద చొప్పున ఇస్తోంది. ఈ ఏడాదికి దరఖాస్తులు తీసుకున్న తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నోటీసు జారీ చేసింది.
‣ విద్యాహక్కు చట్టం కింద 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వమే ఉచితంగా ప్రాథమిక విద్యను అందించాలి. తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు కొనసాగింపు విద్య కింద ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలను సామాజిక న్యాయశాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలు అందిస్తున్నాయి. ఇదే తరహాలో మైనార్టీ మంత్రిత్వశాఖ పరిధిలో తొమ్మిది, పది విద్యార్థులకు మాత్రమే ప్రీ-మెట్రిక్ ఉపకారవేతనాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఆ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తులు మాత్రమే పరిశీలించాలని రాష్ట్రస్థాయి, జిల్లా నోడల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో 1-8 తరగతి విద్యార్థులందరూ కేంద్ర మైనార్టీ శాఖ ఉపకార వేతనాలకు దూరం కానున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.