• facebook
  • whatsapp
  • telegram

VIT: విట్‌ వర్చువల్‌ స్నాతకోత్సవం

ప్రసంగించిన నోబెల్‌ అవార్డు గ్రహీత స్టాన్‌లీ విట్టింగ్‌హామ్‌
ఈనాడు, అమరావతి: కలల సాకారానికి ప్రతి ఒక్కరు శ్రమించాలని నోబెల్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ ఎం.స్టాన్‌లీ విట్టింగ్‌హామ్‌ సూచించారు. జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా ముందుకే సాగాలని, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఉద్బోధించారు. విట్‌ ఏపీ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవాన్ని సెప్టెంబరు 23న వర్చువల్‌లో నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి అమెరికానుంచి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రపంచమంతటా ప్రయాణించి కొత్త విషయాలను తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. శాస్త్ర విజ్ఞానానికి ఎల్లలు లేవని, వైజ్ఞానిక పరిశోధనతోనే కొవిడ్‌లాంటి మహమ్మారులు.. భూతాపాలను పరిష్కరించగలమని పేర్కొన్నారు. విట్‌ ఏపీ ప్రాంగణంలో నిర్మించిన మహాత్మాగాంధీ, సావిత్రిబాయిపూలే, నీలం సంజీవరెడ్డి, రాక్‌ప్లాజా భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మైక్రోసాఫ్ట్‌ ఇండియా డైరెక్టర్‌ మయూరిక సింగ్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు సన్నద్ధం కావాలని అన్నారు. ఈ తరానికి సాంకేతికత అందుబాటులో ఉందని, కష్టపడితేనే విజయం లభిస్తుందని వివరించారు. ఆర్థిక అసమానతల నిర్మూలనకు, సమానత్వానికి విద్య ఎంతో అవసరమని విట్‌ వ్యవస్థాపకుడు, కులపతి జి.విశ్వనాథన్‌ పేర్కొన్నారు. అవుట్‌లుక్‌ ఐకేర్‌ ర్యాంకింగ్స్‌లో విట్‌ ఏపీ విశ్వవిద్యాలయం భారతదేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని వెల్లడించారు. స్నాతకోత్సవంలో 2017 బ్యాచ్‌కు చెందిన 460 మందికి డిగ్రీ పట్టాలనందించారు.

Posted Date : 24-09-2021