• facebook
  • whatsapp
  • telegram

Defence: డిఫెన్స్‌లో మహిళలకు ఓకే

* నవంబరులో జరిగే ఎన్‌డీఏ పరీక్షకు అవకాశం

* సుప్రీంకోర్టు ఆదేశం 

* ఇంకా ఆలస్యం చేయలేమని స్పష్టీకరణ 

దిల్లీ: నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ)లో మహిళల ప్రవేశంపై ఇంకా ఎలాంటి వాయిదాలు ఉండకూడదని సెప్టెంబర్‌ 22న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నవంబరు 14న జరిగే ప్రవేశ పరీక్షల్లో వారికి అవకాశం కల్పించాలని తేల్చి చెప్పింది. సమయం తక్కువగా ఉన్నందున వచ్చే ఏడాది మేలో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు వారిని తీసుకునేలా అవకాశం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. అత్యవసర సమయాల్లో సహాయ పనులు చేపట్టడంలో సైన్యానికి మంచి పేరుందని, ఈ ఏడాది జరిగే పరీక్షల్లో మహిళలకు అవకాశం కల్పించడాన్ని కూడా అలాంటి సందర్భంగానే భావించి ఏర్పాట్లు చేయాలని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (యూపీఎస్‌సీ) సహకారంతో రక్షణ శాఖ తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపింది. పిటిషన్‌దారు కుష్‌ కర్లా తరఫున సీనియర్‌ న్యాయవాది చిన్మయ్‌ ప్రదీప్‌ శర్మ సమర్పించిన పత్రాలను పరిశీలించిన ధర్మాసనం సైనికాధికారులుగా మహిళల చేరికను మరో ఏడాది పాటు వాయిదా వేయలేమని పేర్కొంది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ సైనికాధికారులుగా మహిళలను తీసుకోవడంపై అధ్యయనం చేయడానికి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామని, వీటన్నింటినీ పూర్తి చేసి వచ్చే ఏడాది మే నాటికి తగిన ఏర్పాట్లు చేయగలమని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘‘మీ సమస్యలు అర్థం చేసుకోగలం. సమస్యలకు పరిష్కారాలు కనుక్కొనే సామర్థ్యం మీకుందని నమ్ముతున్నాం. పరీక్షలు రాయాలని అభ్యర్థులు ఉత్సాహం చూపుతున్నందున కేంద్రం వాదనను అంగీకరించలేం. అత్యంత క్లిష్టమైన సమస్యలను సైన్యం ఎదుర్కొంది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం వారి శిక్షణలో ఒక భాగం. ఈ అత్యవసర పరిస్థితిని కూడా వారు ఎదుర్కొంటారు’’ అని పేర్కొంది.

 

మిలటరీ కాలేజీల్లో ప్రవేశాలపై రెండు వారాల్లో జవాబివ్వండి

దేహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలటరీ కాలేజీ (ఆర్‌ఐఎంసీ)లో మహిళల ప్రవేశంపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఇదే ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్‌ఐఎంసీలో బాలికలకు ప్రవేశం కల్పించాలంటూ న్యాయవాది కైలాస్‌ ఉధవ్‌ రావు మోరో దాఖలు చేసిన ఇంకో వాజ్యం విచారణ సందర్భంగా అదనపు అటార్నీ జనరల్‌ (ఏఎస్‌జీ) వాదనలు వినిపిస్తూ దరఖాస్తుల సమర్పణకు అక్టోబరు 30 చివరి తేదీ కాగా, డిసెంబరు 18న పరీక్ష జరుగుతుందని తెలిపారు. వచ్చే ఏడాది మే నాటికయితే అన్ని ఏర్పాట్లు చేయగలుగుతామని చెప్పారు. ‘‘మేం చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయులుగా మహిళలు అసలు ఉండేవారే కాదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి.  మహిళా టీచర్లు ఉండాల్సిన అవసరాన్ని మేం కూడా గుర్తించాం. ఇలాంటి వ్యవస్థాపక సమస్యలను పరిశీలించాల్సి ఉంది’’ అని ధర్మాసనం తెలిపింది. బాలికల ప్రవేశాన్ని స్వాగతించిన పూర్వ విద్యార్థుల సంఘం..బాలికలకు శారీరక శిక్షణ ఇవ్వాల్సి ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉందని పేర్కొంది. మార్పు ప్రారంభమయిందని, అన్నీ ఒకేసారి జరగవని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను అక్టోబరు ఏడో తేదీకి వాయిదా వేసింది.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!  

‣ ఇగ్నోలో నాన్ టీచింగ్ పోస్టులు

‣ ఉద్యోగం మీకే ఎందుకివ్వాలి

Posted Date : 22-09-2021