• facebook
  • whatsapp
  • telegram

Degree Seats: లక్ష డిగ్రీ సీట్లకు కోత

* 25 శాతంలోపు విద్యార్థులు చేరిన సెక్షన్ల రద్దు

* ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖల నిర్ణయం

* ఈ ఏడాదికి మినహాయించాలంటూ యాజమాన్యాల ఒత్తిడి!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో దాదాపు లక్ష సీట్లకు కోత పడింది. అనూహ్య పరిణామంతో యాజమాన్యాలు షాక్‌ తిన్నాయి. సెక్షన్ల రద్దు, సీట్ల కోత నిర్ణయాన్ని ఈ విద్యా సంవత్సరానికి మినహాయించాలని ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. తక్కువ మంది చేరిన సెక్షన్లను రద్దుచేస్తామని కొన్నేళ్లుగా చెప్తున్నా ఆపై మిన్నకుండిపోతుండటం తెలిసిందే. ఈసారి ముందుగా ప్రకటించినట్లే రాష్ట్ర ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ నిర్ణయాన్ని అమలుచేయడంతో కళాశాలల ప్రతినిధులు కంగుతిన్నారు. రాష్ట్రంలోని 978 ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో సీట్లను డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌) ద్వారా భర్తీ చేస్తున్నారు. అందులో సుమారు 4.20 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొలిసారిగా ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలవుతోంది. ఏటా 2.25 లక్షల నుంచి 2.50 లక్షల సీట్లే నిండుతున్నాయి. దాదాపు 2లక్షల సీట్లు మిగిలిపోతున్నాయి. అందుకే విద్యార్థులు చేరని కోర్సులను, సెక్షన్లను రద్దుచేస్తామని కొన్నేళ్లుగా అధికారులు ప్రకటిస్తున్నా కార్యరూపం దాల్చలేదు. ఈసారి దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన జూన్‌ 29నే ఒక సెక్షన్‌లో 60 సీట్లుంటే 15 మందిలోపే చేరితే(25 శాతం) మరో కళాశాలలో చేరతారా?..అని విద్యార్థులను అడుగుతామని, మూడో విడతలో ఆ సెక్షన్‌ను రద్దుచేస్తామని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. నిర్ణయాన్ని ఈసారి అమల్లోకి తెచ్చింది.

 

*మూడో విడత తర్వాత సెక్షన్లు బ్లాక్‌

సెప్టెంబర్‌ 16న దోస్త్‌ మూడో విడత సీట్లను కేటాయించారు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న అధికారులు దాదాపు 700 ప్రైవేట్‌ కళాశాలల్లో 1500లకు పైగా బీఏ, బీకాం, బీఎస్‌సీ కోర్సుల్లో సెక్షన్లను రద్దుచేశారు. కళాశాలలకు, విద్యార్థులకు కనిపించకుండా వాటిని సాఫ్ట్‌వేర్‌లో బ్లాక్‌ చేశారు. వాటిలో సుమారు లక్ష సీట్లున్నాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. కొన్ని కళాశాలలేమో వరుసగా మూడేళ్లపాటు ప్రవేశాలను పరిశీలించకుండా సెక్షన్లను రద్దుచేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.

 

*నిర్ణయం వాయిదాకు యాజమాన్యాల ఒత్తిడి!

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఇంకా పూర్తికాక విద్యార్థులు సందిగ్ధంలో ఉన్నారని, ఇకనుంచి చేరే అవకాశం ఉందని దాదాపు 20 కళాశాలల ప్రతినిధులు సెప్టెంబర్‌ 27న కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ను కలిసి చర్చించారు. ఈసారికి నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరారు. ఇంకా పలు మార్గాల నుంచి ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ అందుబాటులో లేకపోవడంతో ఆయనతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. దీనిపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రిని ‘ఈనాడు’ వివరణ కోరగా.. సీట్లను బ్లాక్‌ చేసిన మాట వాస్తవమేనన్నారు. ఒక కోర్సులో 180 సీట్లుండగా.. 60 మంది చేరితే రెండు సెక్షన్లు ఉంచి ఒక దాన్ని బ్లాక్‌ చేశామన్నారు. యాజమాన్యాల వాదన విని న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.