• facebook
  • whatsapp
  • telegram

DELED: రెండేళ్ల కోర్సుకు మూడేళ్ల వ్యవధి

* 3, 4 సెమిస్టర్‌ పరీక్షల కోసం నిరీక్షణ
* గందరగోళంలో డీఈఎల్‌ఈడీ అభ్యర్థులు

న్యూస్‌టుడే, గుడివాడ గ్రామీణం: రెండేళ్లలో పూర్తి కావాల్సిన డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ) కోర్సు ప్రస్తుతం మూడేళ్ల కాలం పడుతోంది. ప్రవేశ పరీక్ష ఎంత ముందుగా నిర్వహించినా ఫలితాలు, ర్యాంకుల ప్రకటన, కౌన్సెలింగ్‌ తదితరాలన్నీ పూర్తి చేసి తరగతులు నిర్వహించాలంటే నవంబర్‌, డిసెంబర్‌ కూడా అయిన సందర్భాలున్నాయి. ఇతర అన్ని కోర్సుల తరగతులు జులై, ఆగస్టు నెలల్లో ప్రారంభమవుతుండగా డీఈఎల్‌ఈడీ కోర్సుకు మాత్రం తరగతులు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో చాలా మంది ర్యాంకులు వచ్చినా కౌన్సెలింగ్‌లో జాప్యం వల్ల వేరే కోర్సుల్లో చేరుతున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగం చేయాలనే తపన ఉన్న వారు మాత్రం ఇళ్ల వద్ద ఉండిపోవాల్సివస్తోంది. చివరకు విద్యాసంవత్సరం మూడొంతులు పూర్తయ్యాక ఈ కోర్సు తరగతులు మొదలవుతున్నాయి.

 

అయోమయంలో ప్రవేశాలు

కృష్ణా జిల్లా అంగలూరులోని ప్రభుత్వ డైట్‌ కళాశాలలో గత వారంలో జరిగిన మొదటి విడత కౌన్సెలింగ్‌కు 100 సీట్లకు గాను 42 మంది అభ్యర్థులు మాత్రమే వచ్చి ధ్రువపత్రాలు పరిశీలన చేయించుకొని ప్రవేశాలు పొందారు. మొదటి విడత కేవలం ప్రభుత్వ కళాశాలలకే కౌన్సెలింగ్‌ నిర్వహించగా అతి తక్కువ మందే ధ్రువపత్రాలు పరిశీలన చేయించుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్క విసన్నపేటలో మాత్రమే ప్రైవేటు కళాశాల ఉంది. అందులో చేరాలనుకున్న వారు రెండో విడత కౌన్సెలింగ్‌కు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అక్టోబరు వచ్చేసింది. రెండో విడత కౌన్సెలింగ్‌ ఎప్పుడు నిర్వహిస్తారో  అంతుచిక్కని ప్రశ్నలా మారింది. ఇదిలా ఉండగా 2021-23 సంవత్సరం వారికి ఏడాదికి రెండు సెమిస్టర్‌ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉండగా ఇంతవరకూ మొదటి సెమిస్టర్‌ పరీక్షలే కాలేదు. గత నెలలో పరీక్ష ఫీజుకు నోటిఫికేషన్‌ వెలువడినా మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదని వాయిదా వేశారు. కోర్సు ప్రారంభమై 8 నెలలు గడిచినా మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ కోసం పరీక్షలు వాయిదా వేయడం హాస్యాస్పందంగా ఉందని పలువురు ఛాత్రోపాధ్యాయుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

2020-22 బ్యాచ్‌ 4వ సెమిస్టర్‌ ఎప్పుడో..?

డీఈఎల్‌ఈడీ 2020-22 బ్యాచ్‌ 2020 డిసెంబరులో కౌన్సెలింగ్‌ పూర్తి చేసి తరగతులు ప్రారంభించారు. ఆ ఆలస్యం నేటికీ కొనసాగుతుంది. కోర్సు ఆగస్టు నెలలో పూర్తయింది. కానీ 3వ సెమిస్టర్‌ పరీక్షలు అక్టోబరు 26 నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగో సెమిస్టర్‌ పరీక్షలకు వెళ్లాలంటే ఫైనల్‌ టీచింగ్‌ ప్రాక్టికల్స్‌ జరగాల్సి ఉంది. కోర్సు కాల వ్యవధి రెండేళ్లే అయినప్పటికీ ప్రస్తుతం మూడో విద్యా సంవత్సరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో తోచక 3, 4వ సెమిస్టర్‌ పరీక్షల కోసం ఛాత్రోపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? ధ్రువపత్రాలు చేతికొచ్చేదెప్పుడో తెలియని అగమ్యగోచరంగా ఉందని అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.