• facebook
  • whatsapp
  • telegram

ప్రైవేట్‌లోఆన్‌లైన్‌ తరగతులు షురూ!  

* జూన్‌ 15 వరకు వేసవి సెలవులు ప్రకటించిన విద్యాశాఖ

* లెక్క చేయని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ‌ రాష్ట్రంలో విద్యాశాఖ ఆదేశాలు కేవలం ప్రభుత్వ విద్యాసంస్థలకే పరిమితం అవుతున్నాయి. ప్రభుత్వం ఏం ఆదేశాలు, ఉత్తర్వులు ఇచ్చినా ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. జూన్‌ 15వ తేదీ వరకు ఉపాధ్యాయులకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నామని రాష్ట్రంలోని అన్ని రకాల యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు తెరవడానికి వీల్లేదని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన గతనెలలో ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభించకుండా ఆన్‌లైన్‌ తరగతులు నడుపుకోవడానికి వీల్లేదు. కానీ రాష్ట్రంలో హైదరాబాద్‌ సహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌ తదితర అన్ని నగరాల్లో పలు ప్రైవేట్‌ పాఠశాలలు జూన్‌ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ పాఠాలు మొదలుపెట్టాయి. ఇంకొన్ని 4న ప్రారంభించగా.. మరికొన్ని 7వ తేదీ నుంచి ఆరంభిస్తామని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. సర్కారు ఆదేశాలను ఉల్లంఘించి తరగతులు నడిపినా ఎలాంటి చర్యలు ఉండకపోవడంతో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రైవేట్‌ బడుల్లో దాదాపు 32 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.
 

Posted Date : 14-06-2021