• facebook
  • whatsapp
  • telegram

ఇంటింటా ఇన్నోవేటర్‌కు దరఖాస్తుల ఆహ్వానం

* ఆగస్టు 10 వరకు గడువు పొడిగింపు


న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: విద్యార్థుల మస్తిష్కంలో మెరిసే కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏటా ‘ఇంటింటా ఇన్నోవేషన్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులే కాదు.. ఎవరైనా శాస్త్రవేత్తలుగా మారే సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. కొత్త ఆలోచనలకు పదును పెట్టడం, వాటికి సృజనాత్మకతను జోడించి, ఆవిష్కరణలు చేపట్టేందుకు 2021 - 22 సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మూడేళ్ల కిందట తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టగా ఏటికేడు స్పందన పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పౌరులు, ఆవిష్కర్తల మధ్య అనుసంధానం పెరగాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో అత్యంత ప్రతిభకనబర్చిన వారికి ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసాపత్రాలను అందిస్తున్నారు. ఔత్సాహికులు ఆగస్టు 10లోగా తమ ఆవిష్కరణలకు సంబంధించి వాట్సాప్‌లో సందేశాన్ని పంపించాల్సి ఉంటుంది. 
అర్హులు ఎవరెవరు..?
పాఠశాలలు, కళాశాలల పరిధిలోని విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, మెకానిక్‌లు, వ్యవసాయదారులు, మహిళలు, గ్రామీణ ఆవిష్కర్తలు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులు.. ఇలా ఎవరైనా ఇందులో పాల్గొని సృజనాత్మకతను పరీక్షించుకోవచ్చు. ప్రజల్లో దాగి ఉన్న ప్రతిభకు రూపం ఇచ్చేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ ఏడాది కూడా త్వరలో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుల ప్రదర్శన చేపట్టనున్నారు. ఆన్‌లైన్‌లో పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. అయిదు కేటగిరీల్లో ఆన్‌లైన్‌లో బహుమతులు అందజేస్తారు. 
వాట్సాప్‌ ద్వారా దరఖాస్తు
ఇంటింటా ఇన్నోవేషన్‌లో అక్షరాస్యులు, నిరక్షరాస్యులు ఎవరైనా సరే తమ ఆవిష్కరణలకు సంబంధించిన ఆరు వాక్యాలు, రెండు నిమిషాలు నిడివి ఉన్న వీడియోను పంపించాలి. ప్రాజెక్టుకు సంబంధించి నాలుగు ఫొటోలు, ఆవిష్కరణకర్త పేరు, చరవాణి నెంబరు, ప్రస్తుత వృత్తి, గ్రామం, జిల్లా పేరు తదితర వివరాలను 9100678543 నెంబరుకు వాట్సాప్‌ చేయాలి. లేదా సంబంధిత జిల్లా సైన్స్‌ అధికారి నెంబరుకు కూడా వాట్సాప్‌ చేయవచ్చు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను పంపించేందుకు ఆగస్టు 10 వరకు గడువు పొడిగించారు. 
సృజన చాటేందుకు సువర్ణావకాశం 
  పౌరుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, ప్రతిభను వెలికితీసేందుకు అందరికీ అవకాశం కల్పిస్తూ ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జులై 25తో ముగియనున్న గడువును పొడిగించారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి. మంచి ప్రతిభ కనబరిస్తే రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. 
 - రవినందన్‌రావు, జిల్లా సైన్స్‌ అధికారి, పెద్దపల్లి

ఉమ్మడి జిల్లాలో వచ్చిన దరఖాస్తులు
కరీంనగర్‌: 7, పెద్దపల్లి: 7
జగిత్యాల: 6, రాజన్న సిరిసిల్ల: 4

Posted Date : 27-07-2021