• facebook
  • whatsapp
  • telegram

మరో మూడేళ్ల వరకు మార్పు వద్దు!  

* ఇప్పటికిప్పుడు ఏకీకృత కౌన్సెలింగ్‌ విధానంలో చేరడం మంచిది కాదు
* ఎంబీబీఎస్‌, పీజీ వైద్య విద్య ప్రవేశాలపై ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ


ఈనాడు, అమరావతి: ఎంబీబీఎస్‌, పీజీ వైద్య విద్యలో ప్రవేశాలను మరో మూడేళ్ల వరకు యథాతథంగా జరపాల్సిన అవసరం ఉందని నిపుణుల కమిటీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటికిప్పుడు ఏకీకృత కౌన్సెలింగ్‌ విధానంలో చేరడం మంచిది కాదని పేర్కొంది. కేంద్రీకృత విధానంలో ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహణ ప్రతిపాదనను ఇటీవల కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు వివరించి, వాటి అభిప్రాయాలను లిఖితపూర్వకంగా కోరింది. దీనిపై చర్చించి నివేదిక సమర్పించాలని ఐదుగురితో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిటీ వేసింది. పలు దఫాలుగా చర్చించి రూపొందించిన నివేదికను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌కి జులై 26న‌ అందజేసినట్లు కమిటీ ఛైర్మన్‌, ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ శ్యాంప్రసాద్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆర్టికల్‌ 371-డి  అనుసరించి వైద్య విద్యలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. దీని ప్రకారం 85% సీట్లు స్థానికులకు, 15% స్థానికేతరులకు కేటాయిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ పదేళ్ల వరకు ఇదే విధానాన్ని కొనసాగించాల్సి ఉంది. 2024తో పదేళ్ల గడువు ముగుస్తుంది. దీనికితోడు కేంద్ర వైఖరి గురించి స్పష్టంగా తెలుసుకోవడానికి వీలుగా 2024 వరకు వేచి ఉండటం మంచిదని సూచించినట్లు ఉపకులపతి శ్యాంప్రసాద్‌ తెలిపారు. బీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు, 2020 డిసెంబరులో ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం రిజర్వుడు కేటగిరీ అభ్యర్థి ఓపెన్‌ కేటగిరీకి వెళ్లినప్పుడు ఆ సీటును అదే కేటగిరీ వారితో భర్తీ చేసే విధానం, ఇతర అంశాలపై కమిటీ చర్చించింది. వైద్య విద్యలో ప్రవేశాలను ఆయా రాష్ట్రాల నిబంధనలు అనుసరించి నిర్వహిస్తామని కేంద్రం పేర్కొన్నప్పటికీ త్వరపడకూడదని పేర్కొంది. జాతీయ స్థాయిలో కౌన్సెలింగ్‌ నిర్వహణపై విధానపరమైన నిర్ణయాలు తీసుకొని కేంద్రం లిఖితపూర్వకంగా తెలియచేస్తే స్పందిస్తామని తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంచేశాయి. ఈ అంశాన్నీ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. సీట్ల భర్తీలో ఏమైనా సమస్యలొస్తే విద్యార్థులు దిల్లీలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. దీనినీ కమిటీ పరిశీలించింది. రాష్ట్రంలో పీజీ వైద్య సీట్ల భర్తీలో ఉన్న ప్రత్యేక విధానాన్ని కూడా కమిటీ సమీక్షించింది. ఈ కమిటీ సమర్పించిన నివేదికపై ముఖ్యమంత్రి జగన్‌తో చర్చించిన అనంతరం కేంద్రానికి తన స్పందనను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయనుంది. ప్రస్తుతం దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్‌/పీజీలో ఉన్న వాటిలో 15% సీట్లను కేంద్రానికి అప్పగిస్తున్నాయి. వీటిని నీట్‌ ర్యాంక్‌ ఆధారంగా జాతీయ కోటాలో రెండు విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించి భర్తీ చేస్తోంది. ఆ తరువాత మిగిలిన సీట్లను మళ్లీ రాష్ట్రాలకు వెనక్కి పంపుతోంది. వీటితోపాటు ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 85%, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోని ఎ, బి, సి కేటగిరీ సీట్లను ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం భర్తీ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే స్పందనను అనుసరించి కేంద్రం ఏకీకృత విధానంలో కౌన్సెలింగ్‌ చేపట్టేందుకు ఆర్డినెన్స్‌ తెచ్చే విషయాన్ని పరిశీలించే అవకాశం ఉంది. 2021 - 22 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలు యథాతథంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Posted Date : 27-07-2021