• facebook
  • whatsapp
  • telegram

TET: టెట్‌ జరపకుండా నియామకాలు ఎలా?

* నాలుగేళ్లుగా జరగని ఉపాధ్యాయ అర్హత పరీక్ష

* విద్యాశాఖ ప్రతిపాదన పంపినా ప్రభుత్వ స్పందన కరవు 

ఇప్పటికే ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నారని, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేస్తే ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్‌టీ) ద్వారా సాధారణ పాఠశాలల్లో ఖాళీలు ఉండవని ప్రభుత్వం భావించినా.. సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ గురుకులాలతో పాటు మోడల్‌ స్కూళ్లలో 6-8వ తరగతి వరకు బోధించే ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ) కొలువులను భర్తీ చేయాలన్నా టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తీర్ణులైన వారిని కలుపుకొని ఇప్పటికే రాష్ట్రంలో టెట్‌ పాసైన వారు 2.50 లక్షల మంది ఉంటారని అంచనా. వారిని మాత్రమే ఉద్యోగాలకు పోటీపడేలా అవకాశం ఇస్తామంటే న్యాయపరమైన చిక్కులు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. టెట్‌ జరపకుండా ఉపాధ్యాయ ఖాళీలపై నోటిఫికేషన్‌ ఇవ్వడం వీలయ్యే పరిస్థితి లేదని విద్యాశాఖ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఆ పరీక్ష దిశగా ప్రభుత్వంలో ఇప్పటివరకు కదలిక లేదు. 

వేగంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెబుతున్న ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి తప్పనిసరైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహించడాన్ని మరిచిపోయింది. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం కనీసం ఏడాదికి ఒకసారి జరపాలి. కానీ గత నాలుగేళ్లుగా టెట్‌ నిర్వహించలేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది బీఈడీ, డీఈడీ చదువు పూర్తయిన విద్యార్థులు దీనికోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2016లో, 2017 జులై 23న పరీక్ష జరిపారు. అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 2018 జనవరి 12న టెట్‌పై సమీక్షించారు. పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని, అందుకు నిబంధనల్లో సవరణలు అవసరమని ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన సమర్పించింది. దానిపై ఇప్పటివరకు నిర్ణయం వెలువడలేదు. బీఈడీ అభ్యర్థులు కూడా 1-5 తరగతుల బోధన కోసం ఉపాధ్యాయ నియామకాల్లో పోటీ పడవచ్చని 2019లో ఎన్‌సీటీఈ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈక్రమంలో బీఈడీ అభ్యర్థులు సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(ఎస్‌టీజీ) పోస్టులకు పోటీపడేందుకు టెట్‌లోని పేపర్‌-1 రాసేలా నిబంధన మార్చాలని 2019 మార్చి 15న అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దానికీ మోక్షం లేదు. 

Posted Date : 19-09-2021