• facebook
  • whatsapp
  • telegram

Gurukula Hostels: హాస్టళ్లు తెరవకుంటే పరీక్షలు రాసేదెలా? 

* గురుకుల విద్యార్థుల్లో ఆందోళన

 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ గురుకులాల్లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు కొత్త చిక్కు వచ్చి పడింది. మిగిలినవారి మాదిరిగా ప్రత్యక్ష తరగతులకు హాజరు కాలేకపోతున్నామని ఆవేదనలో ఉన్న వారికి.. ఇప్పుడు హాస్టళ్లు తెరవకుండా అక్టోబర్‌లో జరిగే పరీక్షలు ఎలా రాయాలని ఆవేదన చెందుతున్నారు. గురుకుల విధానంలో విద్యనందించే పాఠశాలలను తెరవరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆగస్టు 31న హైకోర్టు ఆదేశించింది. ఈక్రమంలో మిగిలిన విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లి చదువుకుంటుండగా.. గురుకులాలు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే పాఠాలు వింటున్నారు. ప్రస్తుతం ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అక్టోబరు 25 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు జరుపుతామని ఇంటర్‌బోర్డు ప్రకటించింది. విద్యార్థులంతా ఇప్పుడు సొంతూళ్లలో ఉన్నారు. పరీక్షలు రాయాలంటే హాస్టళ్లు తీయకుండా ఎలా ఆందోళన చెందుతున్నారు. హాస్టళ్లు ఉంటే అధ్యాపకులతో ప్రథమ ఇంటర్‌ పాఠ్యాంశాలను పునశ్చరణ చేయించుకోవచ్చని వారు భావిస్తున్నారు. వసతి గృహాలను తెరవాలంటే హైకోర్టు అనుమతి తప్పనిసరి. హాస్టళ్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు న్యాయస్థానంలో అఫిడవిట్‌ దాఖలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 

 

70 వేలమందికి పైనే 

వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాల్లో సుమారు 40 వేలమంది, ఆదర్శ పాఠశాల (మోడల్‌)ల్లో దాదాపు 19 వేలమంది, 172 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో సుమారు 12 వేలమంది ఇంటర్‌ విద్యార్థులు ఉన్నారు. 
 

Posted Date : 27-09-2021