• facebook
  • whatsapp
  • telegram

Jobs: సెంట్రల్‌ వర్సిటీల్లో నియామకాలకు ఉమ్మడి వేదిక

* అభ్యర్థుల వివరాలను విశ్వవిద్యాలయాలకు పంపుతాం
* యూజీసీ ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ వెల్లడి

ఈనాడు, దిల్లీ: కేంద్ర విశ్వవిద్యాలయాల్లో నియామకాల నిమిత్తం ఉమ్మడి నియామక వెబ్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ తెలిపారు. ‘సంవాద్‌’ పేరుతో అక్టోబ‌రు 4న‌ విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్థల నిర్వాహకులతో ఆయన వీడియో ద్వారా మాట్లాడారు. విశ్వవిద్యాలయాలు వేటికవి ప్రత్యేక నియామక కార్యక్రమాలు చేపట్టుకోవచ్చని, అందుకు అవసరమైన దరఖాస్తుల స్వీకరణ మాత్రం కామన్‌ రిక్రూట్‌మెంట్‌ పోర్టల్‌ ద్వారా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, అప్పుడు వారి దరఖాస్తులను ఉద్యోగాల కోసం ప్రకటనలు జారీచేసే వర్సిటీలకు పంపుతామని వివరించారు. ఈ పోర్టల్‌ అమల్లోకివస్తే కేంద్ర విశ్వవిద్యాలయాలకు సంబంధించిన బోధనా సిబ్బంది నియామక వివరాలన్నీ ఒక్కచోటే లభ్యమవుతాయన్నారు.
‘యూజీసీ నెట్‌’ ఎప్పుడు? 
జాతీయ అర్హత పరీక్ష (నెట్‌)ను డిసెంబరులో నిర్వహిస్తారా? లేదంటే వచ్చే ఏడాది జూన్‌తో దాన్ని విలీనం చేస్తారా? అన్నదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలో దీనిపై ప్రకటన చేస్తామని జగదీశ్‌కుమార్‌ చెప్పారు. విద్యార్థులు ఏ సబ్జెక్టుల్లోనైనా ఏకకాలంలో డ్యూయల్‌ డిగ్రీ చేయొచ్చన్నారు. అయితే ప్రత్యక్ష విధానం (ఫిజికల్‌ మోడ్‌)లో రెండు డిగ్రీలు చేయడం కష్టమని, విద్యార్థులు ఏకకాలంలో రెండు తరగతులకు వెళ్లడం సాధ్యంకాదు కాబట్టి.. ఒక డిగ్రీని ఆన్‌లైన్‌లో చేయవచ్చని సూచించారు. సెంట్రల్‌ యూనివర్సిటీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (క్యూయెట్‌) ద్వారా చేపట్టే ప్రవేశాల నిమిత్తం కేంద్రీకృత కౌన్సిలింగ్‌ నిర్వహించే అంశాన్ని భాగస్వామ్యపక్షాలతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు. బీఈడీ సైన్స్‌, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఒకేసారి చేయొచ్చా? అన్న ప్రశ్నకు బదులిస్తూ... బీఈడీ కోర్సు వేరే నియంత్రణ సంస్థ పరిధిలోకి వస్తుందని, అందువల్ల డ్యూయెల్‌ డిగ్రీ చేయడంపై ఆ సంస్థ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం యూజీసీ, ఏఐసీటీఈలు కలిసి... రెండు వ్యవస్థల మార్గదర్శకాలు, నిబంధనలు ఒకేలా ఉండేలా చూస్తున్నాయన్నారు.
ఇంటర్న్‌షిప్‌నకు కొత్త మార్గదర్శకాలు
ఇంటర్న్‌షిప్‌ కోసం త్వరలో మార్గదర్శకాలు జారీచేస్తామని జగదీశ్‌కుమార్‌ చెప్పారు. విద్యార్థి తాను చదివే సబ్జెక్ట్‌లో మాత్రమే ఇంటర్న్‌షిప్‌ చేయాల్సిన అవసరం లేదని, ఇంకెక్కడైనా వెళ్లి అక్కడున్న పరిస్థితులపై అధ్యయనంచేసి, నివేదికను సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఇంటర్న్‌షిప్‌ ప్రధాన ఉద్దేశం నిజ జీవితంలో ఎదురవుతున్న సమస్యలను అర్థం చేసుకొని వాటికి పరిష్కారాలు చూపడమేనన్నారు. విద్యార్థులకు అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఇంటర్న్‌షిప్‌ను తీర్చిదిద్దబోతున్నట్లు చెప్పారు.
ఉన్నత విద్య కోసం ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు
భవిష్యత్తులో ఉన్నత విద్య నియంత్రణ కోసం ‘హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’ ఏర్పాటు కానుందని యూజీసీ ఛైర్మన్‌ చెప్పారు. ఇది అమల్లోకి వస్తే... అనుమతుల కోసం పలు సంస్థల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. పీహెచ్‌డీ విద్యార్థులు థీసిస్‌ సమర్పించడానికి ముందు తప్పనిసరిగా పరిశోధనపత్రం (రీసెర్చ్‌ పేపర్‌) సమర్పించాలన్న నిబంధనను తొలగించామని, అయితే ఇది కొత్తగా పీహెచ్‌డీలో చేరే విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మళ్లీ అగ్రస్థానంలో ఐఐఎస్సీ

‣ సైన్స్‌ బోధనలో.. పరిశోధనలో!

‣ నీకు నువ్వు న‌చ్చ‌ట్లేదా?

‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.