* ఇష్టానుసారం పరీక్షల నిర్వహణ సరికాదు
* జూనియర్ లెక్చరర్ పోస్టుల పరీక్షలపై టీఎస్‌పీఎస్సీకి ఆదేశం
* కీలక ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల వడపోతలో భాగంగా తెలుగు మాధ్యమం అభ్యర్థులను పట్టించుకోకుండా ఆంగ్ల మాధ్యమం వారికి అవకాశం కల్పించరాదు. కనీస విద్యార్హత ఉన్న వారందరినీ అర్హతల ఆధారంగా ఎంపికకు అంచనా వేయాలి. అలాకాకుండా ప్రాథమిక దశలోనే ఆంగ్ల మాధ్యమం వారికి ప్రాధాన్యం ఇవ్వడం తెలుగువారికి నిరాశ కలిగించేదే. ప్రశ్నపత్రం ఆంగ్లంలో మాత్రమే ఇస్తే ఆర్థిక, సామాజిక కారణాల వల్ల తెలుగులో పీజీ చేసిన అభ్యర్థులు ఆంగ్ల అభ్యర్థులతో పోటీపడలేరు. తెలుగు మాధ్యమంలో చదువుకున్న అభ్యర్థి ప్రశ్నను భిన్నంగా అర్థం చేసుకుంటే అది ఉద్యోగావకాశంపై ప్రభావం పడవచ్చు.
- జస్టిస్ కె.శరత్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించే రాత పరీక్షల్లో రెండో పేపర్ ప్రశ్నపత్రాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో ఇవ్వాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ)ని ఆదేశిస్తూ మార్చి 20న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నియామక నిబంధనలు లేకుండా ఇష్టానుసారం పరీక్ష విధానాన్ని మార్చే అధికారం కమిషన్‌కు లేదని పేర్కొంది. జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్‌లో పేపర్-2 ప్రశ్నపత్రం కేవలం ఆంగ్లంలో ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆదిలాబాద్‌కు చెందిన టి.విజయ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శరత్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రభుత్వ కళాశాలలున్నాయని, మాధ్యమపరంగా ఖాళీలను వెల్లడించలేదని అన్నారు. 2004, 2008లో నోటిఫికేషన్‌లలో పేపర్-2 ఐచ్ఛిక సబ్జెక్ట్‌కు రెండు భాషల్లోనూ ప్రశ్నపత్రం ఇచ్చారన్నారు. కమిషన్ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ జూనియర్ లెక్చరర్ పోస్టులకు పీజీని విద్యార్హతగా నిర్ణయించామని, తెలంగాణలో పీజీ కోర్సు ఆంగ్లంలోనే కొనసాగుతోందన్నారు. 16 ఐచ్ఛిక సబ్జెక్టులున్నాయని, వీటన్నింటికీ తెలుగు, ఆంగ్లంల్లో ప్రశ్నపత్రాలు ఇవ్వాలంటే కష్టసాధ్యమైన పని అన్నారు.
* ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి యూనివర్సిటీల ప్రాస్పెక్టస్ పరిశీలించాక ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు దూరవిద్య కేంద్రాలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనమిక్స్, హిస్టరీ సబ్జెక్టులను తెలుగు, ఆంగ్లంలోను, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ సోషియల్ సైన్సెస్, ఎం.ఎ.ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీలు తెలుగులో మాత్రమే బోధిస్తున్నట్లు వెల్లడైందన్నారు. అందువల్ల రాష్ట్రంలో పీజీ కోర్సు ఆంగ్లంలోనే కొనసాగుతోందన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాదన సరికాదన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి నిబంధనల ప్రస్తావన లేదని, అంతేకాకుండా గత నోటిఫికేషన్‌లలో రెండు భాషల్లో పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశంపై ఎలాంటి సమాధానం లేదన్నారు. అలహాబాద్ హైకోర్టులో నియామకాలపై.., ఏపీ హైకోర్టు తెలుగుభాష ప్రాధాన్యంపై ఇచ్చిన కీలకమైన తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తెలంగాణ అధికార భాషల చట్టంలోని సెక్షన్-3 ప్రకారం తెలుగు, ఉర్దూను వినియోగిస్తారు. శాసనసభల్లో అధికారిక ప్రయోజనాల కోసం సెక్షన్-4 ప్రకారం ఆంగ్లాన్ని వినియోగిస్తారన్నారు. దీనిప్రకారం తెలుగును అధికార భాషగా వినియోగిస్తున్నారని, ఆంగ్లాన్ని అధికారిక ప్రయోజనాల నిమిత్తం ఉపయోగిస్తున్నారని చెప్పారు. నోటిఫికేషన్‌లో నిబంధనలు లేకుండా ఆంగ్లం మాత్రమే ఇచ్చే అధికారం కమిషన్‌కు లేదన్నారు. 450 మార్కులకు నిర్వహించే ప్రశ్నపత్రంలో పేపర్-2లో 150 ప్రశ్నలకు 300 మార్కులుంటాయని, అంటే అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా పీజీస్థాయిలోని రెండో పేపరుపైనే ఆధారపడి ఉంటుందన్నారు. అందువల్ల పేపర్-2 ప్రశ్నపత్రాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో ఇవ్వాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశిస్తూ జస్టిస్ శరత్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ చెత్తను వదిలించే చక్కటి ఉద్యోగం!
‣ గ్రూప్-2కి సమగ్ర సన్నద్ధత ఎలా?
‣ రివిజన్..ప్రాక్టీస్.. సక్సెస్ సూత్రాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.