* ఏటా నోటిఫికేషన్లు వస్తే ఇంత గోస ఉండదు
* ఒకసారి అవకాశం చేజారితే అంతే సంగతి
* నిరుద్యోగుల్లో భయాందోళనకు కారణమిదే
ఈనాడు, హైదరాబాద్: అకడమిక్ వార్షిక పరీక్షలు ఏ నెలలో జరుగుతాయో ప్రతి విద్యార్థికి తెలుసు. ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లను ఫిబ్రవరి/మార్చిలో ఇచ్చి, మేలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉద్యోగ పోటీ పరీక్షల పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిభిన్నంగా తయారైంది. ఏళ్ల తరబడి ఎదురు చూశాక ఏదైనా ఉద్యోగ ప్రకటన వస్తే, మరోసారి అదే ఉద్యోగానికి ప్రకటన ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియడంలేదు. అందుకే ప్రశ్నపత్రాల లీకేజీ, కోర్టు వివాదాలపై నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
జీవితంలో రెండుసార్లే అవకాశం
సివిల్స్‌ను జనరల్ అభ్యర్థులు 32 ఏళ్లలోపు ఆరుసార్లు, ఓబీసీలు 35 ఏళ్లలోపు తొమ్మిదిసార్లు, ఎస్సీ, ఎస్టీలు 37 ఏళ్లలోపు ఎన్నిసార్లయినా రాసుకుంటున్నారు. అదీ ఏటా ఒకసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గ్రూప్-1ను మాత్రం జీవితంలో రెండుసార్లు రాస్తే ఎక్కువని అభ్యర్థులు గుర్తుచేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఇదే తొలి గ్రూప్-1. అందుకే 2022 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదలవగా ఏకంగా 3.86 లక్షల మంది దరఖాస్తు చేశారు. అక్టోబరులో జరిగిన ప్రిలిమ్స్‌కు 2.50 లక్షల మంది హాజరయ్యారు. మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న దశలో ప్రశ్నపత్రం లీకేజీ అభ్యర్థులను కుంగదీసింది. ఉమ్మడి ఏపీలో 2011లో గ్రూప్-1 ప్రకటన వెలువడింది. కోర్టు వివాదాల కారణంగా మెయిన్స్‌ను 2016లో ఏపీ, తెలంగాణలో వేర్వేరుగా నిర్వహించారు. అంటే 11 సంవత్సరాల తర్వాత మరో ప్రకటన వచ్చింది. ఇక గ్రూప్-2 ప్రకటన 2016లో రాగా, ఆరేళ్లకు మరోటి ఇచ్చారు. టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్‌టీ) తదితరాల పరిస్థితీ ఇదే. ‘నా వయసు 39. 2016లో గ్రూపు-2 రాసినా నెగ్గలేదు. ఇప్పుడు రెండోసారి అవకాశం వచ్చింది. నాకు ఇదే చివరిది కావొచ్చు’ అని హైదరాబాద్‌కు చెందిన సాయి వాపోయారు. ‘2017 జులైలో టీఆర్‌టీ నోటిఫికేషన్ ఇచ్చారు. కొత్తది ఎప్పుడొస్తుందో తెలియడం లేదు’ అని డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
ఆదర్శంగా యూపీఎస్సీ
యూపీఎస్సీ తన జాబ్ క్యాలెండర్‌ను ఏడాది ముందే ప్రకటించి, దానికనుగుణంగానే నోటిఫికేషన్లు ఇచ్చి, నియామకాలను పూర్తిచేస్తుంది. 2023లో ఇవ్వనున్న నోటిఫికేషన్లు, వాటి విడుదల తేదీలు, దరఖాస్తుల ప్రారంభ తేదీ, పరీక్షలు, ఫలితాల తేదీలను 2022 మేలోనే వెల్లడించింది. కరోనా సమయంలో కొద్దిగా ఆలస్యమైనా.. క్యాలెండర్‌ను ఇప్పుడు యథాతథ స్థితికి తీసుకొచ్చింది. నోటిఫికేషన్ ఇస్తే 8-12 నెలల్లో ప్రక్రియ ముగించి, నియామకపత్రాలను అందజేస్తోంది.
ఇక్కడ అంతా అనిశ్చితి
ఇకపై ఉద్యోగ నియామకాలన్నీ జాబ్ క్యాలెండర్ ప్రకారమే జరుగుతాయని సీఎం కేసీఆర్ 2022 మార్చి 9న శాసనసభలో ప్రకటించారు. రాష్ట్రంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. కొంతకాలంగా వివిధ ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నా.. వాటిలో పరీక్ష, ఫలితాల తేదీలను చెప్పడంలేదు. ఇటీవల రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను జూన్‌లో నిర్వహిస్తామన్న టీఎస్‌పీఎస్సీ మెయిన్స్ ఎప్పుడన్నది వెల్లడించలేదు. ‘ఏటా నోటిఫికేషన్లు వస్తే అభ్యర్థులపై ఇంత ఒత్తిడి ఉండదు’ అని టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు మన్మథరెడ్డి అభిప్రాయపడ్డారు.
కాలాన్ని వెనక్కి తెచ్చుకోలేం కదా!: జట్టి పల్లవి, హనుమకొండ
ఆర్థికంగా నష్టపోతే కోలుకోవచ్చు. కానీ... విలువైన కాలాన్ని వెనక్కి తెచ్చుకోలేం. వయసు పెరిగేకొద్దీ పరీక్షల సన్నద్ధతపై ఆసక్తి పోతుంది. ఏపీ నుంచి కొట్లాడి విడిపోయాం. ఆ పోరాటానికి తగిన ఫలితం రాకుంటే ఉపయోగం ఏముంటుంది?
ఏ ప్రకటన వస్తే అదే రాయాల్సి వస్తోంది: ఇర్ఫాన్ పాషా, ములుగు జిల్లా
నేను డిగ్రీ, డీఈడీ పూర్తి చేశా. 2017 తర్వాత టీఆర్‌టీ నోటిఫికేషన్ రాలేదు. గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసి మెయిన్స్‌కు అర్హత సాధించా. గ్రూప్-2, 3, 4లకూ సిద్ధమవుతున్నా. కొలువు రాకుంటే పరిస్థితి ఏమిటో, మళ్లీ నోటిఫికేషన్లు ఇంకెన్నేళ్లకు వస్తాయో? తెలియడంలేదు. జాబ్ క్యాలెండర్‌ను అమలు చేస్తే తప్ప మాలాంటి వారి మనసు కుదుటపడదు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కచ్చితంగా కావచ్చు.. కాకపోవచ్చు!
‣ మాక్‌టెస్ట్‌ల సాధనతో మెరుగైన స్కోరు!
‣ మేనేజర్లకు టూరిజం స్వాగతం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.