• facebook
  • whatsapp
  • telegram

Engineering: ఇంజినీరింగ్‌దే హవా!

 

* పెరుగుతున్న పీహెచ్‌డీలు  

* యూజీతోపాటు పరిశోధనలోనూ మారుతున్న తీరు

* వెల్లడించిన అఖిల భారత ఉన్నత విద్య సర్వే

ఈనాడు, అమరావతి: దేశవ్యాప్తంగా పీహెచ్‌డీ ప్రవేశాల్లో ట్రెండ్‌ మారుతోంది. తొలి నుంచీ పీహెచ్‌డీ ప్రవేశాలు ఆర్ట్స్‌ గ్రూపుల్లో ఎక్కువగా ఉండేవి. కొంతకాలంగా ఇంజినీరింగ్‌, టెక్నాలజీలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో వస్తున్న మార్పులు పరిశోధనపైనా ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల వెలువడిన అఖిల భారత ఉన్నత విద్య సర్వే నివేదిక ఈ తీరును వెల్లడించింది. ఇవీ వివరాలు...

పరిశోధన(పీహెచ్‌డీ)లో ప్రవేశాల తీరును అఖిల భారత ఉన్నత విద్య విభాగం పరిశీలించింది. ఇందుకు 2020-21 గణాంకాలను ఆధారంగా చేసుకుంది. సర్వే వివరాలను ఇటీవలే వెల్లడించింది. 2020-21లో దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం పీహెచ్‌డీ ప్రవేశాల్లో అత్యధికంగా 27.3% మంది ఇంజినీరింగ్‌, టెక్నాలజీ కోర్సుల్లోనే చేరారు. ఆ తర్వాత 23.4% మంది సైన్సును ఎంచుకున్నారు. సైన్సు విభాగంలో మహిళలు, ఇంజినీరింగ్‌లో పురుషులు అత్యధికంగా చేరారు. ఇంజినీరింగ్‌, టెక్నాలజీలోని 21 కోర్సుల్లో 56,625 మంది అడ్మిషన్లు పొందగా... ఇందులో మహిళలు 18,875 (33.33%), పురుషులు 37,750 (66.66%) మంది ఉన్నారు. సైన్సు స్ట్రీమ్‌లో 48,600 మంది చేరగా... వారిలో అమ్మాయిలు 23,710 (48.8%) ఉండగా... అబ్బాయిలు 24,890 (51.21%) మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 2,11,852 మంది ప్రవేశాలు పొందగా... వీరిలో పురుషులు 1,16,764, మహిళలు 95,088 మంది ఉన్నారు. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 16.07%, మహారాష్ట్ర 10.98%, తమిళనాడులో 8.06% మంది పీహెచ్‌డీలో చేరారు.

కంప్యూటర్‌ కోర్సుకే డిమాండ్‌

అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో కంప్యూటర్‌ సైన్సు ఇంజినీరింగ్‌కే ఎక్కువ డిమాండ్‌ ఉంటోంది. ఈ ప్రభావం పీహెచ్‌డీపైనా కనిపిస్తోంది. ఎక్కువ మంది కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌కు ప్రాధాన్యం ఇస్తుండగా... ఆ తర్వాత మెకానికల్‌, ఎలక్ట్రానిక్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌లో ప్రవేశాలు పొందారు. ఆంధ్రప్రదేశ్‌లో 2020-21లో 6,991 మంది పీహెచ్‌డీలో చేరగా... వారిలో పురుషులు 4,283 మంది, మహిళలు 2,708 మంది ఉన్నారు. మరోవైపు నైజీరియా, యెమన్‌, భూటాన్‌, నేపాల్‌లాంటి దేశాలకు చెందిన 1,454 మంది మన దేశంలో పీహెచ్‌డీలు చేస్తున్నారు. ఇక 2020లో దేశవ్యాప్తంగా 25,550 మంది పీహెచ్‌డీ పూర్తి చేయగా... వారిలో పురుషులు 14,422, మహిళలు 11,128 మంది పట్టాలు అందుకున్నారు. అత్యధికంగా తమిళనాడు(3,206), ఉత్తర్‌ప్రదేశ్‌(2,217), కర్ణాటక(2,125)లు వీటిని ప్రదానం చేశాయి.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.