ఈనాడు, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం(2023-24) దేశవ్యాప్తంగా కొత్తగా ఇంజినీరింగ్ కళాశాలలను పెట్టుకోవచ్చు. అందుకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి కొనసాగుతున్న నిషేధాన్ని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఎత్తివేసింది. ఈ మేరకు బుధవారం నిర్ణయం తీసుకుంది. ఏటా ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, పాలిటెక్నిక్ కళాశాలల అనుమతుల కోసం విధివిధినాలతో కూడిన హ్యాండ్‌బుక్‌ను ఏఐసీటీఈ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దాన్ని బుధవారం విడుదల చేయగా... పూర్తి వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను గురువారం నుంచి వెబ్‌సైట్‌లో ఉంచనుంది. కొత్త కళాశాలలు ఏర్పాటు చేయాలనుకుంటే గతంలో మాదిరిగా ఏఐసీటీఈ పోర్టల్‌కు కాకుండా నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్) అనే పోర్టల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. బహుళ కోర్సులను ప్రవేశపెట్టుకోవచ్చు. అంటే ఒకే ప్రాంగణంలో లేదా కళాశాలలలో పాలిటెక్నిక్, బీటెక్ కోర్సులు ఉండొచ్చు. ఈసారి కొత్తగా బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్‌ను కోర్ బ్రాంచిగా గుర్తించారు. ఏఐసీటీఈ నిర్ణయం నేపథ్యంలో తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం కొత్త కళాశాలలు ఏర్పాటుకు కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయి.
మరికొన్ని మార్పులు ఇవీ...
* అవసరమైన తరగతి గదుల సంఖ్యను, కార్పెట్ ఏరియాను కూడా బాగా తగ్గించారు. పాలిటెక్నిక్‌లో ప్రతి ఎనిమిది మందికి ఒకటి, బీటెక్‌లో ప్రతి 10 విద్యార్థులకు ఒక కంప్యూటర్ ఉంటే చాలు. బీటెక్‌లో ఇప్పటివరకు ఆ నిష్పత్తి 1:6 గా ఉంది.
* కళాశాలకు గరిష్ఠ సీట్లను 300 నుంచి 360కి పెంచారు. ఎంసీఏ సీట్లను 180 నుంచి 300కి పెంచారు.
* ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కోర్సులకు ఇక నుంచి ఏఐసీటీఈ అనుమతి ఇవ్వదు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఫార్మసీ కౌన్సిల్, ఆర్కిటెక్చర్ కౌన్సిల్ మాత్రమే అనుమతి ఇస్తాయి.
* విదేశీ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు, ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌ల కోసం గతంలో ప్రపంచ ర్యాంకు ఉన్న 500 వర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఈసారి దాన్ని వెయ్యి ర్యాంకుల వరకు పొడిగించారు.
* దేశవ్యాప్తంగా ఉన్న ఏఐసీటీఈ ప్రాంతీయ కార్యాలయాలను ఎత్తివేశారు.
* పాలిటెక్నిక్ కళాశాలల్లో షిప్ట్‌ల విధానాన్ని రెగ్యులర్‌గా మార్చుకునేందుకు 2023-24 విద్యా సంవత్సరం వరకు పొడిగించారు.
* ప్రస్తుతం ఉన్న కళాశాలల్లో కొత్త కోర్సులు కావాలంటే 50 శాతం సీట్లు నిండాలన్న నిబంధన ఉండేది. దాన్ని ఎత్తివేశారు
మరింత సమాచారం... మీ కోసం!
‣ టీఎస్‌పీఎస్సీ నియామక పరీక్షలు ఆన్‌లైన్‌లో..!
‣ ఈనాడు జర్నలిజం స్కూలు నోటిఫికేషన్
‣ కాలుష్య నియంత్రణ బోర్డులో కొలువులు
‣ అమెరికాలో అడ్వాన్స్‌డ్ కోర్సులు ఇవే!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.