నిరక్షరాస్యులూ ఆ జాబితాలోనే..
మండలి పట్టభద్రుల ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు
నారాయణ.. వాలంటీర్ ఇవన్నీ విద్యార్హతలేనట
నిరక్షరాస్యులు, 5, 9, 10వ తరగతి చదివిన వారూ పట్టభద్రులే!
ఈనాడు, అమరావతి: నారాయణ.. సాహిత్య.. శాంతి ఆశ్రమం.. ఎన్‌కే... నేతాజీ స్ట్రీట్.. ఎన్జీవోస్ కాలనీ.. నాట్ ఎడ్యుకేటెడ్... నాట్ స్టడీడ్.. నథింగ్.. రెల్లివీధి.. ఎన్‌ఎన్.. వాలంటీర్.. సెక్షన్ ఏ అండ్ బీ..నాట్ యాక్యూరేట్.. ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా? శాసనమండలి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని ఓటర్ల విద్యార్హతలు. ఈ కోర్సులు చదివినట్లు దరఖాస్తులో పేర్కొనటమే తరువాయి... వారందర్నీ ఎన్నికల సంఘం పట్టభద్రులుగా గుర్తించేసి ఓటు హక్కు కల్పించేసింది. రాష్ట్రంలో ఎన్నికల సంఘం పనితీరుకు ఈ ఓటర్ల జాబితానే పెద్ద ఉదాహరణ అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయాలి. వైకాపా అభ్యర్థులను గెలిపించి జగనన్న రుణం తీర్చుకోవాలి’ అని మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు వాలంటీర్లకు లక్ష్యాలు నిర్దేశించడంతో వారిలో కొంతమంది బోగస్, అనర్హులతో పెద్ద ఎత్తున దరఖాస్తులు చేయించారు. జాబితాలో బోగస్ ఓటర్లు ఉన్నారంటూ వివరాలతో ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినా వాటిని ఎన్నికల సంఘం సరిదిద్దలేదు. దీంతో తుది జాబితాలోనూ అనేక అవకతవకలు వెలుగుచూస్తున్నాయి. శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఓటరుగా చేరాలంటే డిగ్రీ విద్యార్హత ఉండాలి. కానీ నిరక్షరాస్యులు, 5, 7, 10, ఇంటర్ విద్యార్హతలున్నవారికీ ఓటు హక్కు కల్పించేశారు. కొందరైతే తమ విద్యార్హతలుగా వీధి పేర్లు, ఊరు పేర్లు, తాము చేస్తున్న వృత్తి సహా..అర్థంపర్థం లేని పదాలను పేర్కొన్నారు.
వార్డు సచివాలయ వాలంటీరు.. ఇదీ ఓ విద్యార్హతే
‣ మద్దిలపాలెం డీవీఎస్ కృష్ణా డిగ్రీ కళాశాలలోని 231వ నంబర్ పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే ఓటర్ల జాబితాలో ఆర్తిసింగ్ అనే పేరుంది. ఆమె విద్యార్హత ‘నాట్ యాక్యూరేట్’గా పేర్కొన్నారు.
‣ చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితాలోని సీరియల్ నంబర్ 1,298లో లక్ష్మణ్ దమర్‌సింగ్ అనే పేరుంది. ఇతని విద్యార్హతను వాలంటీరుగా పేర్కొన్నారు.
‣ నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 204వ నంబర్ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో సీరియల్ నంబర్ 674లో జెర్రిపోతుల వెంకట శివన్నారాయణ అనే పేరుంది. ఈయన విద్యార్హత ‘లేట్’ అని పేర్కొన్నారు.
‣ మాధవధార జీవీఎంసీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం పరిధిలోని జాబితాలో శ్రీనివాసరావు మొకరా అనే పేరుంది. ఆయన విద్యార్హత ‘నారాయణ’ గా పేర్కొన్నారు.
‣ జీవీఎంసీ ప్రైమరీ స్కూల్‌లోని 241వ నంబర్ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలోని సీరియల్ నంబర్ 124లో సుమన్ చిర్ల అనే పేరుంది. విద్యార్హత ‘ఎంఎం’ అని ఉంది.
‣ ఆనందపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లోని ఓటర్ల జాబితాలో సత్యవతి అరిగి అనే పేరుంది. ఈమె విద్యార్హత ‘నాట్ అప్లికబుల్’ అని పేర్కొన్నారు.
వారు కూడా పట్టభద్రులేనట
‣ ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని 204వ నంబర్ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలోని సీరియల్ నంబర్ 149లో కంబాల శ్రీనివాసరావు, 219వ నంబర్ పోలింగ్ కేంద్రం పరిధిలో రంగోలి కల్యాణి, 247వ పోలింగ్ కేంద్రం పరిధిలోని కీర్తి అడ్డగరాళ్ల, 278వ నంబర్ పోలింగ్ కేంద్రం పరిధిలోని శివప్రసాద్ రజన్ తదితరుల విద్యార్హతలు ‘అయిదో తరగతి’ అని ఓటర్ల జాబితాలో ఉంది.
‣ 228వ నంబర్ పోలింగ్ కేంద్రంలోని వీర వెంకట గంగాధర రవి, 201వ పోలింగ్ కేంద్రం పరిధిలోని చిత్రాడ మోహనరావు, 276వ పోలింగ్ కేంద్రంలోని అల్లాడ మురళీకృష్ణ, 289వ పోలింగ్ కేంద్రం పరిధిలోని అప్పలనాయుడు తదితరుల విద్యార్హతల కాలమ్‌లో ‘నిరక్షరాస్యులు’ అని ఉంది.
‣ 5, 9, 10, ఐటీఐ, డిప్లమో వంటి కోర్సులు విద్యార్హతలుగా ఉన్న వందల మందిని పట్టభద్రుల ఓటర్ల జాబితాలో చేర్చేశారు.
వాలంటీర్లే సూత్రధారులు..
ఓటర్ల నమోదు సహా ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి పనులూ వాలంటీర్లకు అప్పగించొద్దంటూ ఎన్నికల సంఘం నాలుగైదు సార్లు ఆదేశాలిచ్చింది. కానీ అవి పక్కాగా అమలయ్యేలా చూడలేదు. దీంతో పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేచింది. పట్టభద్రుల ఓటు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలంటే దరఖాస్తుతో పాటు విద్యార్హతకు సంబంధించిన పట్టానూ సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. చాలా మంది డిగ్రీ పట్టాకు బదులుగా ఏదో ఒక పత్రాన్ని అప్‌లోడ్ చేసేశారు. వాటిపై క్షేత్రస్థాయిలో... పూర్తిగా విచారించకుండానే ఓటు హక్కు కల్పించటంతో అనర్హులకు జాబితాలో చోటు లభించింది. ఇవి కాకుండా ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ సార్లు జాబితాలో ఉంది. ఇవి కూడా నకిలీ ఓట్లే.
ఒక్క విశాఖలోనే 5,141 బోగస్ ఓట్లు
విశాఖపట్నం జిల్లాలోనే 5,141 బోగస్ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఏ.అజశర్మ తెలిపారు. వీటిల్లో 4,069 మంది పేర్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉన్నాయని వివరించారు. నిరక్షరాస్యులు, 5, 7, 9వ తరగతి. ఐటీఐ, ఇంటర్మీడియట్ చదివిన వారికి కూడా ఓటు హక్కు కల్పించేశారని.. ఇలాంటివారిని 1752 మందిని గుర్తించామని చెప్పారు. వీటన్నింటిపై సమగ్రంగా విచారించాలని డిమాండు చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ చెత్తను వదిలించే చక్కటి ఉద్యోగం!
‣ గ్రూప్-2కి సమగ్ర సన్నద్ధత ఎలా?
‣ రివిజన్..ప్రాక్టీస్.. సక్సెస్ సూత్రాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.