• facebook
  • whatsapp
  • telegram

Ration Dealer: ‘రేషన్‌ డీలరు’కు.. పరీక్ష!

 

చిత్రం చూసి ఇదేదో సర్కారీ ఉద్యోగం కోసం నిర్వహిస్తున్న పోటీ పరీక్ష అనుకుంటే పొరపాటే. ఇందులో కనిపిస్తున్న వారంతా రేషన్‌ డీలర్లుగా ఎంపికయ్యేందుకు పరీక్ష రాస్తున్న అభ్యర్థులు. ఒకప్పుడు వీరి ఎంపిక ప్రక్రియ ఎంతో సులభంగా జరిగేది. ప్రస్తుతం ఆ డీలర్‌ పోస్టులకూ అభ్యర్థులను రాత పరీక్ష, ముఖాముఖి ద్వారా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట జిల్లా పరిధి సిద్దిపేట, గజ్వేల్‌లో సెప్టెంబర్‌ 18న రాత పరీక్ష నిర్వహించారు. ఈ రెండు డివిజన్ల పరిధిలో 30 డీలర్‌ పోస్టులు ఖాళీగా ఉండగా.. 302 మంది దరఖాస్తు చేశారు. పరీక్షకు 255 మంది హాజరయ్యారు. 80 మార్కులకు రాత పరీక్ష, మరో 20 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. తొలుత పదో తరగతి అర్హత ఆధారంగా దరఖాస్తులు ఆహ్వానించారు. అభ్యర్థుల్లో 100 మందికి పైగా డిగ్రీ, బీటెక్‌, ఉన్నత విద్యావంతులూ ఉండటం గమనార్హం. కొవిడ్‌ నిబంధనల మధ్య ఈ పరీక్ష నిర్వహించినట్లు సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి తెలిపారు.

Posted Date : 19-09-2021