వీలైనంత తర్వగా ఇచ్చేందుకు కార్యాచరణ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనలపై నియామక సంస్థలు కసరత్తు వేగవంతం చేశాయి. ప్రభుత్వ అనుమతులు వచ్చిన పోస్టులకు వీలైనంత త్వరగా ప్రకటనలు జారీ చేయాలని నిర్ణయించాయి. కీలకమైన గ్రూప్-2, 3తో పాటు అత్యధిక పోస్టులున్న గురుకుల ఉద్యోగ ప్రకటనలు త్వరగా వెలువరించేందుకు సన్నద్ధమవుతున్నాయి. నియామక సంస్థలు సంబంధిత విభాగాధిపతులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉద్యోగ ప్రకటనల జారీకి వీలుగా ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నాయి. కొన్ని విభాగాల్లోని పోస్టుల విద్యార్హతలు, సర్వీసు నిబంధనల్లో ఏమైనా మార్పులుంటే సరిచూసుకోవాలని చెబుతున్నాయి. గ్రూప్-2, 3, 4 ఉద్యోగాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో.., సంబంధిత విభాగాలతో టీఎస్పీఎస్సీ రోజూ సమావేశాలు నిర్వహిస్తోంది. ఒక్కోరోజు కొందరు విభాగాధిపతులను పిలిపించి, ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. గిరిజన రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో గ్రూప్-2, 3పై ప్రతిపాదనలు అందాయి. గ్రూప్-2, 3, 4లో మరికొన్ని విభాగాలకు చెందిన పోస్టులను ప్రభుత్వం చేర్చింది. ఈ నేపథ్యంలో ఆయా విభాగాల అధికారులతో మరోసారి సమావేశమై ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. గురుకుల నియామకాలపై సంబంధిత బోర్డు సమావేశాలకు సిద్ధమవుతోంది. డిసెంబరులోగా ఈ ప్రకటన విడుదలకు కార్యాచరణ రూపొందించింది. తొలుత అత్యధిక పోస్టులున్న టీజీటీ, పీజీటీ పోస్టులకు ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు సమాచారం.
గ్రూప్-4పై సమావేశాలు
గ్రూప్-4లో 9,168 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నవంబరు 25న అనుమతి ఇచ్చింది. దీంతో టీఎస్పీఎస్సీ బోర్డు నవంబరు 26న సమావేశమై.. కొలువుల కసరత్తుపై చర్చించింది. గ్రూప్-2, 3 ప్రతిపాదనల్ని కొలిక్కి తీసుకువస్తూ, గ్రూప్-4 ఉద్యోగాలపై సన్నాహక సమావేశాలు జరపాలని నిర్ణయించింది. నవంబరు 28 నుంచి గ్రూప్-4 ఉద్యోగాల ప్రతిపాదనల తయారీకి సంబంధిత విభాగాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ కొలువులకు ప్రతిపాదనలు జాగ్రత్తగా రూపొందించాలని, త్వరగా అందేలా చూడాలని టీఎస్పీఎస్సీ అధికారులు సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పిలుస్తోంది.. ఫ్యాషన్ ప్రపంచం!
‣ 160 విద్యాసంస్థల్లోకి... జాట్ దారి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.