‣ ఆగస్టు 11 వరకు పొడిగించిన కేంద్రం
‣ తెలంగాణ సహా పలు రాష్ట్రాల విద్యార్థులకు ఊరట
దిల్లీ: ఎంబీబీఎస్ అభ్యర్థులకు శుభవార్త. నీట్ పీజీ-2023 పరీక్ష అర్హత విషయంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల అభ్యర్థులకు ఊరట లభించింది. ఆ పరీక్షకు హాజరయ్యేందుకు తప్పనిసరిగా పూర్తిచేయాల్సిన ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్(ఏడాది కాలం) కటాఫ్ తేదీని ఆగస్టు 11 వరకు కేంద్రం పొడిగించింది. పలు రాష్ట్రాలు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తయ్యేవారే నీట్ పీజీ-2023 పరీక్షకు అర్హులని కేంద్రం తొలుత పేర్కొంది. ఆ కటాఫ్ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ జనవరి 13న నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
అయితే కొవిడ్ మహమ్మారి కారణంగా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్ గతేడాది ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ ఏడాది జూన్ 30 లోపు అది పూర్తవ్వదు. ఫలితంగా చాలామంది విద్యార్థులు నీట్ పీజీ పరీక్ష రాసేందుకు అనర్హులుగా మారే ముప్పు ఏర్పడింది. తాజా నిర్ణయంతో తెలంగాణలోని దాదాపు 4 వేలమంది విద్యార్థులు సహా పలు రాష్ట్రాల అభ్యర్థులందరికీ ఉపశమనం లభించినట్లయింది. వీరంతా ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు నీట్ పీజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష మార్చి 5న జరగనుంది. దాన్ని వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు విన్నవిస్తున్నాయి. మరోవైపు ఎండీఎస్ నీట్ రాసేందుకు వీలుగా బీడీఎస్ విద్యార్థుల ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీని ఈ ఏడాది జూన్ 30 వరకు పెంచుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం ట్విటర్ వేదికగా ప్రకటించింది. ఎండీఎస్ నీట్ అభ్యర్థులు శుక్రవారం (ఫిబ్రవరి 10) సాయంత్రం 3 గంటల నుంచి ఆదివారం (ఫిబ్రవరి 12) అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
‣ నీట్- సూపర్ స్పెషాలిటీ కోర్సులకు అర్హత ప్రమాణాన్ని 50 పర్సంటైల్ నుంచి 20 పర్సంటైల్‌కు కేంద్రం తగ్గించింది. జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ)తో సంప్రదింపుల అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవితబీమాలో ఆఫీసర్ ఉద్యోగాలు
‣ పది పాసయ్యారా.. ఇదిగో మీకే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
‣ బాగా రాసేవాళ్లకు బోలెడు ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.