అక్రిడిటేషన్, కరిక్యులమ్ అభివృద్ధికి ‘గురుకుల్’
ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ విద్య, పాఠశాల విద్యను కలిపి నాలుగు డైరెక్టరేట్లను ఏర్పాటు చేయనున్నారు. జాతీయ విద్యా విధానం, సీబీఎస్‌ఈ సిలబస్ అమలు నేపథ్యంలో ఇంటర్ విద్య కమిషనరేట్‌ను పాఠశాల విద్య కమిషనరేట్‌లో విలీనం చేయబోతున్నారు. ఈ రెండు కమిషనరేట్ల విలీనం కోసం కమిటీని ఏర్పాటుచేయగా అది రూపొందిస్తున్న నివేదిక తుదిదశకు చేరింది. విలీనాన్ని మూడు దశల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించింది. 5+3+3+4 విధానంలో తరగతులను విభజించి, డైరెక్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు పాఠశాల విద్య కమిషనరేట్ పరిధిలో 1-10 తరగతులు ఉండగా.. ఇంటర్మీడియట్‌ను ఇంటర్ కమిషనరేట్ పర్యవేక్షిస్తోంది. భవిష్యత్తులో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, 1, 2 తరగతులను డైరెక్టర్ ఫౌండేషన్ విద్య, 3, 4, 5 తరగతులను ప్రాథమిక విద్య డైరెక్టర్, 6, 7, 8 తరగతులు డైరెక్టర్ మిడిల్ స్కూల్, 9-12 తరగతులను డైరెక్టర్ హైయ్యర్ సెకండరీగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యతలను జిల్లా స్థాయిలో జిల్లా విద్యాధికారులకు, హైయ్యర్ సెకండరీలోని పాఠశాలలను జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారికి అప్పగిస్తారు. 9, 10 తరగతులను సమీపంలోని జూనియర్ కళాశాలల్లో విలీనం చేస్తారు.
ఎలక్టివ్‌గా వృత్తి విద్య సబ్జెక్టులు
‣ ప్రిన్సిపాల్ 9-12 తరగతులు, ప్రధానోపాధ్యాయుడు 8వ తరగతి వరకు పర్యవేక్షిస్తారు. ఆదర్శ పాఠశాలలు, హైస్కూల్ ప్లస్, కస్తూర్బాగాంధీ బాలికా పాఠశాలల్లో 9-12 వరకు పీజీటీలతో బోధన చేయిస్తారు.
‣ ఈ ఏడాది ఎనిమిదో తరగతిలో సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేస్తున్నారు. 2025-26 నాటికి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది సీబీఎస్‌ఈలోకి మారుతుంది. ఆ తర్వాత ఏడాది ద్వితీయ సంవత్సరానికి ఇదే సిలబస్‌ను అమలు చేస్తారు.
‣ సమగ్ర శిక్ష అభియాన్, ఇంటర్మీడియట్ వృత్తి విద్యను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తారు. అక్రిడిటేషన్, అసెస్‌మెంట్, కరిక్యులమ్ డెవలప్‌మెంట్, శిక్షణ, నియామకాలు, పరిశోధనల కోసం ‘గురుకుల్’ను తీసుకురానున్నారు. దీని అమలుకు ప్రతి జిల్లాకు అకడమిక్ సమన్వయకర్తలను నియమించాలని ప్రతిపాదించారు.
‣ వృత్తి విద్యాకోర్సుల కోసం జిల్లా, జోనల్ స్థాయిలో నోడల్ అధికారులను నియమిస్తారు. వీరు ఏడు కోర్సుల కంటే ఎక్కువ ఉన్న కళాశాలలను పరిశ్రమలు, ఇతర ఏజెన్సీలతో అనుసంధానం, ఇంటర్న్‌షిప్‌కు చర్యలు తీసుకుంటారు. వృత్తి విద్యా కోర్సులను విద్యార్థులకు ఎలక్టివ్‌గా సబ్జెక్టులు పెడతారు.
‣ సెమిస్టర్ విధానం అమలు చేస్తారు. భవిష్యత్తులో పది, ఇంటర్ మొదటి సంవత్సరానికి బోర్డు పరీక్షలు ఉండవు. విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షలు నిర్వహిస్తారు.
‣ పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డును స్వయంప్రతిపత్తి సంస్థగా మార్పు చేస్తారు. సంయుక్త, డిప్యూటీ కార్యదర్శుల పోస్టులను సంయుక్త, డిప్యూటీ డైరెక్టర్లుగా మార్పు చేస్తారు. అకడమిక్, అడ్మినిస్ట్రేషన్, గురుకుల్, కరిక్యులమ్ స్టడీస్, శిక్షణ, నియామకాలు, పరీక్షల నియంత్రణకు డైరెక్టర్ పోస్టులు ఉంటాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.