• facebook
  • whatsapp
  • telegram

5 నుంచి పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2021-22 విద్యా సంవత్సరానికి 133 పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 30,512 సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. అందులో 780 సీట్లు ఫార్మసీ కాగా మిగిలినవి పాలిటెక్నిక్‌ సీట్లు. గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 3 వేల సీట్లు తగ్గాయి. రాష్ట్రంలో 54 ప్రభుత్వ కళాశాలల్లో 12,042 సీట్లు, ఒక ఎయిడెడ్‌ కళాశాలలో 230 సీట్లు, 64 ప్రైవేట్‌ కళాశాలల్లో 17,460 సీట్లతో పాటు 14 ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ డిప్లొమా సీట్లున్నాయి. మూడు ప్రైవేట్‌ కళాశాలలు ఈసారి అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఆగ‌స్టు 5 (గురువారం) నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. పాలిటెక్నిక్‌లో 100 శాతం సీట్లను కన్వీనర్‌ కోటా కిందనే భర్తీ చేస్తారు. ఈ విద్యా సంవత్సరం కమలా నెహ్రూ పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలు ఉండవని తొలుత ప్రకటించినా మళ్లీ ప్రవేశాలను కొనసాగిస్తున్నారని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి వర్గాలు స్పష్టం చేశాయి. ఇంజినీరింగ్‌ కళాశాల ప్రారంభానికి ఏఐసీటీఈ నుంచి ఆమోదం రాకపోవడంతో పాలిటెక్నిక్‌ ప్రవేశాలు ఉంటాయని ఓ అధికారి తెలిపారు.
నేడు దోస్త్‌ సీట్లు కేటాయింపు
రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌) ద్వారా బుధవారం సాయంత్రం సీట్లను కేటాయించనున్నారు. మొత్తం 1.78 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇటీవల దోస్త్‌ ద్వారా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు.

Posted Date : 04-08-2021