• facebook
  • whatsapp
  • telegram

సాంకేతిక విద్యలో లింగ భిన్నత్వం

* గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీ ప్రత్యేక కార్యాచరణ

* బాలికలకు 25 శాతం సీట్ల కేటాయింపు

ఈనాడు, హైదరాబాద్‌: సాంకేతిక విద్యలో విద్యార్థినులను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. లింగ భిన్నత్వం (జెండర్‌ డైవర్సిటీ) పేరిట బీటెక్‌ కోర్సుల్లో బాలికలకు 25 శాతం సీట్లను కేటాయిస్తోంది. తొలిసారిగా గతేడాది ఈ కార్యక్రమాన్ని అమలు చేయగా.. రెండో ఏడాదీ కొనసాగించాలని నిర్ణయించింది. 

 

దేశంలోని సాంకేతిక విద్యాసంస్థల్లో ‘స్టెమ్‌’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్‌) కోర్సుల్లో చేరుతున్న బాలికల సంఖ్య తక్కువగా ఉంది. ట్రిపుల్‌ఐటీలోనూ పీజీ స్థాయి కోర్సుల్లో 26-28 శాతం మంది విద్యార్థినులు ఉండగా.. యూజీ కోర్సుల్లో 17 శాతానికే పరిమితమయ్యారు. రానున్న రెండేళ్లలో దీన్ని 25 శాతానికి పెంచే ఉద్దేశంతో జేఈఈ ఆధారంగా చేపట్టే ప్రవేశాల్లో బాలికలకు ట్రిపుల్‌ఐటీ ప్రాధాన్యం ఇవ్వనుంది. గతేడాది 25 శాతం సీట్లను కేటాయించింది. 40 సీట్లలో వారికి ప్రవేశాలు దక్కాయి. జేఈఈ మెయిన్స్‌లో అత్యుత్తమ పర్సైంటైల్‌ సాధించిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. 

 

ఫీజులోనూ రాయితీ..

ట్రిపుల్‌ఐటీలోని బీటెక్‌ కోర్సులలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రవేశ పరీక్ష (యూజీఈఈ), స్పెషల్‌ ఛానెల్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ (స్పెక్‌), లాటరల్‌ ఎంట్రీ ప్రవేశ పరీక్ష (ఎల్‌ఈఈఈ) తదితర ఆరు రకాల పద్ధతుల్లో ఏటా ప్రవేశాలు జరుగుతుంటాయి. జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ ఆధారంగా సీఎస్‌ఈ, ఈసీఈలలో 160 మందికి ప్రవేశాలు కల్పిస్తుంటారు. ఇందులో 25 శాతం మంది విద్యార్థినులే ఉండనున్నారు. వారికి దరఖాస్తు ఫీజును రూ.500కు తగ్గించారు. ప్రవేశాలు పొందిన విద్యార్థినులకు నాలుగేళ్లపాటు ట్యూషన్‌ ఫీజులో 25 శాతం రాయితీ సైతం లభిస్తుంది. దీనివల్ల ఆర్థిక భారం కారణంగా చదువు మధ్యలోనే నిలిపివేయకుండా ఉండేందుకు వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు. రెండో ఏడాదిలోకి ప్రవేశించిన వారికి ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు ఇవ్వనున్నారు. ఇది ఈ ఏడాది నుంచి అమల్లోకి రానుంది. ‘‘ప్రస్తుతం జేఈఈ ద్వారా జరిగే ప్రవేశాలకే వర్తింపజేస్తుండగా.. రానున్న రోజుల్లో మిగిలిన ప్రవేశ పరీక్షలకూ వర్తింపజేసే అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు https:ugadmissions.iiit.ac.in/jee_page.html  లో సంప్రదించవచ్చు’’ అని ట్రిపుల్‌ఐటీ జెండర్‌ డైవర్సిటీ కమిటీ ఛైర్‌ దీప్తిమిశ్ర శర్మ వివరించారు. 
 

Posted Date : 27-07-2021