పిటిషన్‌లోని ఆరోపణలపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ నోటీసులు
దర్యాప్తు పక్షపాతంగా జరుగుతోందనడానికి ప్రాథమిక ఆధారాల్లేవని స్పష్టీకరణ
ఈనాడు, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో దర్యాప్తుపై స్థాయీ నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, సిట్‌కు మార్చి 21న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌లోని ఆరోపణలపై పూర్తిస్థాయిలో కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీచేస్తూ విచారణను ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై నిష్పాక్షిక దర్యాప్తు నిమిత్తం సీబీఐకి అప్పగించాలంటూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్ నర్సింగ్‌రావు, మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వివేక్ ఠంకా వాదనలు వినిపిస్తూ.. ఏళ్ల తరువాత వచ్చిన నోటిఫికేషన్లకు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారు ఒకరు ఉన్నారని, కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇక్కడ పిటిషన్ దాఖలు చేసిన తరువాత ఐటీ శాఖ మంత్రి విలేకరుల సమావేశం నిర్వహిస్తూ లీకేజీకి ఇద్దరే కారణమని పేర్కొన్నారన్నారు. మంత్రి ఏ హోదాతో దర్యాప్తులో జోక్యం చేసుకుంటారని పిటిషనర్ ప్రశ్నించారు. ఆయన కేవలం ఇద్దరు మాత్రమే నిందితులని పేర్కొంటూ ఛైర్మన్, కార్యదర్శితోపాటు ఇతర ఉద్యోగులకు క్లీన్‌చిట్ ఇచ్చారన్నారు. మంత్రి క్లీన్‌చిట్ ఇచ్చాక సిట్ ఏ విధంగా దర్యాప్తు కొనసాగిస్తుందని సందేహం వెలిబుచ్చారు. అంతేకాకుండా మంత్రి నియోజకవర్గానికి చెందిన ఒక మండలంలోని 20 మందికి అత్యధిక మార్కులు వచ్చాయని తెలిపారు. లీకేజీ వ్యవహారంలో ఉన్నతస్థాయి వ్యక్తులున్నారని, నిష్పాక్షిక దర్యాప్తు నిమిత్తం సీబీఐకి అప్పగించాలని కోరారు.
రాజకీయ లక్ష్యాలతోనే పిటిషన్: ఏజీ
రాజకీయ లక్ష్యాలతో పిటిషన్ దాఖలు చేసినట్లు కనిపిస్తోందని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ తెలిపారు. పిటిషనర్ ఓ రాజకీయ పార్టీకి చెందిన అనుబంధ సంస్థ వ్యక్తి అని, లీకేజీ వ్యవహారంతో ఆయనకు ఎలాంటి సంబంధంలేదని, అందువల్ల పిటిషన్ వేసే పరిధి లేదన్నారు. తెలంగాణ పోలీసులు కీలకమైన ఎన్నో కేసుల దర్యాప్తును సమర్థంగా పూర్తి చేశారని, ఈ కేసులోనూ ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. లీకేజీ బయటపడటంతో అభ్యర్థుల ప్రయోజనార్థం పరీక్షలను రద్దు చేసినట్లు తెలిపారు. దీనిపై ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయలేదని తెలిపారు. మంత్రి ప్రెస్‌మీట్‌కు, ఈ కేసు దర్యాప్తునకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టంచేశారు. మంత్రి ఇద్దరి పేర్లు మాత్రమే చెప్పారని.. అంతమాత్రాన ఇతరులు ఎవరూ ఇందులో లేరన్నట్లు కాదని, ఇప్పటికే మంత్రి వెల్లడించిన పేర్లతోపాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేసిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కేసు నమోదైన వెంటనే ప్రతి ఒక్కరూ కోర్టుకు వచ్చి సీబీఐ దర్యాప్తు కోరడం సహజమైపోయిందని తప్పుబట్టారు. పోలీసులు పలు గ్రామాల్లో పర్యటించి అత్యధిక మార్కులు పొందిన వారిని సైతం విచారించారని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. దర్యాప్తు పక్షపాతంగా జరుగుతోందనడానికి ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. మంత్రి ప్రకటనను ఈ కోర్టు పరిగణనలోకి తీసుకోవడంలేదని స్పష్టంచేశారు. అయితే, పిటిషనర్ల అభ్యర్థన మేరకు దర్యాప్తు నివేదికను పరిశీలించాలని కోర్టు భావిస్తోందన్నారు. అందువల్ల దర్యాప్తుపై స్థాయీ నివేదికను సీల్డ్ కవర్‌లో అందించాలని సిట్‌ను ఆదేశించారు. నివేదికతోపాటు పిటిషనర్ చేసిన ఆరోపణలపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
టీఎస్‌పీఎస్సీలో 8 మంది ఉద్యోగులకు నోటీసులు?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో పూటకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. మార్చి 21న సిట్ పోలీసుల దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిందితుల మొబైల్‌ఫోన్లలోని కాల్‌డేటా, వాట్సప్ గ్రూపులు, చాటింగ్ ఆధారంగా నిఘా బృందాలు వారి గురించి వాకబు చేస్తున్నాయి. వీరిలో గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితాను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. కమిషన్‌లోని వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 8 మంది ఉద్యోగులు గతేడాది అక్టోబరులో జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైనట్లు తాజాగా గుర్తించారు. వీరిలో కొందరు 100కు పైగా మార్కులు సాధించినట్లు నిర్ధారణకు వచ్చారు. వీరి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు నోటీసులు జారీచేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
లీకేజీ ఆధారాలపై దృష్టి
ఈ కేసులో 9 మంది నిందితుల నుంచి నాలుగోరోజు పోలీసు కస్టడీలో కీలక సమాచారం రాబట్టారు. ప్రశ్నపత్రాలు ఎవరికి విక్రయించారనే అంశంపై దృష్టిసారించారు. సిట్ పోలీసులు మంగళవారం నిందితుల నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి వివరాలు రాబట్టినట్లు సమాచారం. ఉదయం రేణుక రాథోడ్, డాక్యానాయక్ దంపతులను మహబూబ్‌నగర్ జిల్లా పగిడ్యాల్ పంచగల్ తండాలోని వారి నివాసానికి తీసుకెళ్లారు. అనంతరం బండ్లగూడ జాగీర్ సన్‌సిటీలో ఈ దంపతులు ఉంటున్న ఇంట్లోనూ సోదాలు జరిపారు. మరో బృందం బడంగ్‌పేట్, మణికొండ ప్రాంతాల్లోని ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి నివాసాల్లో నిర్వహించిన తనిఖీల్లో ప్రశ్నపత్రాలు, పెన్‌డ్రైవ్ లభించినట్లు సమాచారం. మరోవైపు కమిషన్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతేడాది కంప్యూటర్ల మరమ్మతు సమయంలో నిందితులు వాడిన సాఫ్ట్‌వేర్, మార్చిన ఐడీలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. నెట్‌వర్క్ అడ్మిన్‌గా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి మొబైల్‌ఫోన్లలో వాట్సప్ గ్రూపులను పరిశీలిస్తున్నారు. గ్రూపు సభ్యుల్లో పోటీ పరీక్షలకు సిద్ధమైన వారి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిందితుల ద్వారా వారి చిరునామాలను సేకరిస్తున్నారు. అనంతరం వారి ఇళ్లకు వెళ్లి విచారించడమా! నోటీసులు జారీ చేయడమా! అనే దానిపై గురువారం స్పష్టతకు వస్తామని ఓ పోలీసు అధికారి తెలిపారు. తాము పట్టుబడినా ఎక్కడా సాక్ష్యాలు చిక్కకుండా ప్రధాన నిందితులు ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు విశ్వసనీయ సమాచారం. పెన్‌డ్రైవ్‌లకు పాస్‌వర్డ్స్ ఉంచిన నిందితులు.. పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పుడు పాస్‌వర్డ్స్ మరచిపోయామంటూ ఏమార్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
శంకరలక్ష్మిని విచారించిన సిట్
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కమిషన్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండెంట్ శంకరలక్ష్మిని సిట్ పోలీసులు విచారించారు. మంగళవారం రాత్రి ఆమెను పోలీసు భద్రత మధ్య హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయానికి రప్పించారు. ప్రశ్నపత్రాలను కొట్టేసేందుకు నిందితులు ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిలు కమిషన్‌లోని ఆమె కంప్యూటర్‌ను వినియోగించినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిపారు. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను శంకరలక్ష్మి డైరీ నుంచి తీసుకున్నట్లు చెప్పారు. దీనిపై గతంలోనే ఆమె స్పందించారు. డైరీలో తాను ఎలాంటి యూజర్‌ఐడీ, ఐడీ రాయలేదని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సిట్ బృందం ఆమె నుంచి వివరాలు సేకరించింది. రెండోసారి ఆమెను కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. సుమారు గంటపాటు ప్రశ్నించి ఆమె నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. బయటకు వచ్చాక ఆమె మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. విచారణకు శంకరలక్ష్మితో పాటు మరో ఉద్యోగి హాజరైనట్లు సమాచారం.
లొసుగులు.. లోపాలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించే తీరు, ముఖ్యంగా ప్రశ్నపత్రాలను గోప్యంగా ఉంచే విధానం కమిషన్‌లో లోపభూయిష్టంగా ఉందని సిట్ అధికారులు గుర్తించారు. గ్రూప్-1 పరీక్ష రాసేందుకు అనుమతి పొందిన ప్రవీణ్ కార్యాలయంలోకి రావడానికి, కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోకి వెళ్లడానికి ఎలా? ఎవరు అనుమతించారన్నదీ ప్రశ్నార్థకంగా మారింది. వీటన్నింటినీ క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్న సిట్ అధికారులు.. ప్రశ్నపత్రాల తయారీ నుంచి వాటిని భద్రపర్చడంలో, పరీక్షల నిర్వహణతో సంబంధం ఉన్న వారందర్నీ ప్రశ్నించాలని భావిస్తున్నారు.
ఎస్సెమ్మెస్ ఎలర్ట్‌ను డియాక్టివేట్ చేసినా..
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత రోజుల్లో ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా అనేక చర్యలు తీసుకోవచ్చు. కానీ, కమిషన్ కార్యాలయంలో ఇలాంటివేవీ కనిపించలేదని తెలుస్తోంది. ఉదాహరణకు ప్రశ్నపత్రాలను కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని కంప్యూటర్లో భద్రపరుస్తారు. ఆ సెక్షన్ ఇన్‌ఛార్జి తప్ప ఇతరులు ఎవరూ దీన్ని తెరిచే అవకాశం లేకుండా డిజిటల్ లాక్ చేస్తారు. ఎవరైనా తెరవాలని ప్రయత్నిస్తే వెంటనే సంబంధిత ఇన్‌ఛార్జికి ఎస్సెమ్మెస్ ఎలర్ట్ వస్తుంది. దాదాపు సంవత్సరం క్రితం నెట్‌వర్క్ అప్‌గ్రెడేషన్ జరిగినప్పుడే ఈ ఎలర్ట్ విధానాన్ని రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌లు డీయాక్టివేట్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా డైనమిక్ ఐపీని స్టాటిక్ ఐపీగా మార్చారు. కానీ, ప్రశ్నపత్రాలు లీకయ్యేవరకూ, పోలీసులకు ఫిర్యాదు వచ్చేవరకూ కమిషన్ కార్యాలయంలో ఎవరూ గుర్తించలేకపోయారు. పరీక్షల నిర్వహణపై అజమాయిషీ అనేక మంది చేతుల్లో ఉంటుంది. సాంకేతికంగా జరిగిన మార్పులు, రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌ల కదలికలను ఎవరూ అనుమానించకపోవడం అతిపెద్ద తప్పిదంగా భావిస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసేందుకు అనుమతి పొందిన ప్రవీణ్‌ను కార్యాలయంలో యథేచ్ఛగా తిరిగేందుకు అనుమతించడం మరో పెద్ద వైఫల్యమని సిట్ అధికారులు భావిస్తున్నారు. కమిషన్ కార్యాలయంలో పనిచేసేవారు ఎవరైనా ఈ పోటీ పరీక్షలను రాయాలంటే వారిని కీలకమైన కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదా ఇతర విభాగాలకు బదిలీ చేయాలి. ఈ నిబంధనలను ఎవరూ పట్టించుకోలేదని తేలింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా వచ్చిందని పరీక్ష రాసిన తర్వాత అనేక మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి సిద్ధమవుతున్న వారికీ 100 మార్కులు దాటడం గగనమైంది. అలాంటిది సెలవు పెట్టకుండా.. కమిషన్ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తూ రాసిన ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చాయి. అయినప్పటికీ అధికారులు ఎవరికీ అనుమానం రాకపోవడాన్ని సిట్ అధికారులు ఎత్తిచూపుతున్నారు.
కంప్యూటర్ కార్యకలాపాలకు రాజశేఖర్‌రెడ్డిపైనే ఆధారం
కమిషన్ కార్యాలయంలో కంప్యూటర్ వ్యవస్థ ఘోరంగా ఉందని, కొద్దిగా ప్రయత్నిస్తే నెట్‌వర్క్‌లోకి చొరబడటం పెద్ద సమస్య కాదని.. దాంతోపాటు ఇక్కడ పనిచేస్తున్న ఎవరికీ సాంకేతిక అంశాలపై సరైన పరిజ్ఞానం లేదని సిట్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. కంప్యూటర్ కార్యకలాపాలకు సంబంధించిన ప్రతి చిన్న విషయానికీ రాజశేఖర్‌రెడ్డిపై ఆధారపడేవారని.. ఇది కూడా పెద్ద తప్పిదమని అధికారులు భావిస్తున్నారు. ఇన్ని లోపాలు ఉండబట్టే రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌లు తమ పథకం అమలు చేసి ప్రశ్నపత్రాలను కొల్లగొట్టారని ఓ అధికారి వ్యాఖ్యానించారు. వాటిని అమ్ముకోవడంలో తేడా వచ్చి.. పోలీసులకు ఫిర్యాదు వచ్చి ఉండకపోతే ఈ వ్యవహారమే బయటపడేది కాదని, భవిష్యత్తులో జరిగే పరీక్షల ప్రశ్నపత్రాలనూ అమ్ముకుని సొమ్ము చేసుకునేవారని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.