• facebook
  • whatsapp
  • telegram

గ్రూప్‌-1పై సిట్టింగ్‌ జడ్జితో దర్యాప్తు చేయించాలి  

* డిజిటల్‌ మూల్యాంకనంతో అభ్యర్థులకు అన్యాయం

* గవర్నర్‌కు రాసిన లేఖలో నారా లోకేశ్‌

 

ఈనాడు, అమరావతి: గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష జవాబు పత్రాల డిజిటల్‌ మూల్యాంకనంతో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, దీనిపై సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర దర్యాప్తు చేయించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ కోరారు. ఆయన జూన్ 13న‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఈ అంశంపై లేఖ రాశారు. 2018, డిసెంబరు 31న ఇచ్చిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో డిజిటల్‌ మూల్యాంకనం విషయాన్ని ప్రస్తావించలేదని, దీనిపై ఏపీపీఎస్సీ అభ్యర్థులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనివల్ల చాలామంది అభ్యర్థులు అర్హత సాధించలేకపోయారని తెలిపారు. గత రెండేళ్లలో ఏపీపీఎస్సీ తీరు అనుమానాస్పదంగా మారిందని, చివరకు గ్రూప్‌-1 అభ్యర్థుల్లో చాలామంది న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ప్రస్తావించారు. వీటి ప్రిలిమినరీ, రాత పరీక్షలు 2019, 2020లో నిర్వహించగా, ఇంటర్వ్యూలు ఈ నెలలో జరగనున్నట్లు తెలిపారు. మెయిన్స్‌ రాసిన 7 వేల మందిలో 340 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారని, గత నెలలో వందల మంది అభ్యర్థులతో మాట్లాడామని, వారంతా మూల్యాంకనంపై అనుమానాలు వ్యక్తం చేశారని తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల పేర్లు, రోల్‌ నంబర్లను వెల్లడించకపోవడం మరిన్ని అనుమానాలకు దారి తీస్తోందని పేర్కొన్నారు. మెయిన్స్‌ పరీక్ష తర్వాత ఏపీపీఎస్సీ థర్డ్‌ పార్టీని నియమించడం ఆశ్చర్యం కలిగించినట్లు నారా లోకేశ్‌ పేర్కొన్నారు. జవాబు పత్రాల డిజిటల్‌ మూల్యాంకనంలో అవలంబించిన విధానాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నట్లు తెలిపారు.

సీఎంకు తెలుగు యువత అధ్యక్షుడి లేఖ

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల మూల్యాంకనంలో వ్యత్యాసాలున్నాయంటూ పలువురు అభ్యర్థులు విద్యార్థి, యువజన సంఘాలను కలిశారని, కీలకమైన ఈ ఉద్యోగాల ఎంపికలో అవకతకలు, పక్షపాతం లేకుండా పారదర్శకంగా చేపట్టాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీరామ్‌చినబాబు కోరారు. ఈ మేరకు జూన్ 13న‌ సీఎం జగన్‌, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ భాస్కర్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు.

Posted Date : 14-06-2021