* కోచింగ్ కేంద్రాల్లో భారీగా పెరిగిన ఫీజులు
* సంక్షేమ శాఖల పరిధిలో ఉచిత శిక్షణకు పరిమిత సీట్లు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగార్థులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ పోటీపరీక్షలకు శిక్షణ ఆర్థిక భారంగా మారుతోంది. వరుస ఉద్యోగ ప్రకటనలతో హైదరాబాద్‌కు వస్తున్న యువత వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రైవేటులో శిక్షణకు ఫీజులు చెల్లించలేని స్థాయిలో ఉంటే.. సంక్షేమశాఖల పరిధిలో ఉచిత శిక్షణకు సీట్లు పరిమితం చేయడంతో ఆందోళన చెందుతున్నారు. స్వీయ శిక్షణతో గ్రూప్-1 ప్రధాన పరీక్షకు ఎంపికైన అభ్యర్థులతో పాటు గ్రూప్-2, 3, 4 శిక్షణ కోసం వస్తున్న నిరుద్యోగులు కోచింగ్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఉద్యోగార్థుల నుంచి డిమాండ్ పెరగడంతో అప్పటివరకు ఉన్న ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ తరగతుల ఫీజులను అవి భారీగా పెంచాయి. ఒక్క గ్రూప్-1 ప్రధాన పరీక్ష కోచింగ్‌కు ఫీజు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేస్తున్నాయి. గ్రూప్-1లో స్వీయశిక్షణతో పలువురు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు అర్హత సాధించి శిక్షణ కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్‌కు కలిపి రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటే.. ఇప్పుడు మెయిన్స్‌కు రూ.55 వేలకు పైగా వసూలు చేస్తున్నాయి. తెలుగు మీడియం విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతుల వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయని, రూ.40 వేలు చెల్లించాలని చెబుతున్నాయి. ‘‘స్వీయశిక్షణతో గ్రూప్-1 ప్రధాన పరీక్షకు ఎంపికయ్యాను. మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్‌కు వస్తే ఎక్కడికి వెళ్లినా రూ.50 వేలకు పైగా ఫీజులు చెబుతున్నారు’’ అని ఒక అభ్యర్థిని తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్‌లో టెస్ట్ సిరీస్‌కు ముందు రూ.15 వేలు ఉంటే.. ఇప్పుడు రూ.30 వేలు వసూలు చేస్తున్నారు. ఇక గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పేరిట భారీగా శిక్షణ కేంద్రాలు వెలిశాయి. ఫీజు రూ.25 వేలకు పైగా వసూలు చేస్తున్నాయి.
ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ..
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల పరిధిలోని స్టడీకేంద్రాలు ఉచిత శిక్షణ అందిస్తున్నాయి. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా ప్రధాన పరీక్షపై ఇప్పటివరకు నిర్ణయం వెలువరించలేదు. ప్రధాన పరీక్షకు 25 వేల మంది అర్హత సాధించారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు 50 శాతం మందికిపైగా ఉన్నారు. బీసీ స్టడీసర్కిల్ గ్రూప్-1 మెయిన్స్‌కు 500 మందికి శిక్షణ ఇవ్వనుంది. వీరిలో 180 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరికి అదనంగా మరో 320 మందికి శిక్షణ ఇస్తామంది. ఎస్సీ స్టడీసర్కిల్ పరిధిలో శిక్షణ తీసుకున్నవారిలో 100 మంది అర్హత పొందారు. వీరికి మెయిన్స్ శిక్షణ కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఎస్టీ స్టడీసర్కిల్ పరిధిలో 123 మంది ఎంపికయ్యారు. ఆయా సంక్షేమశాఖలు సీట్లను పరిమితం చేయడంతో అర్హులైన పేదవర్గాలు శిక్షణకు దూరమవుతున్నాయి.
శిక్షణ మెటీరియల్ కోసం అన్వేషణ
ఫీజులు, ఖర్చులు పెరగడంతో అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇటీవల గ్రూప్-1, 2 కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు కొందరు జాగ్రత్తగా సమగ్రంగా రాసుకున్న నోట్స్‌ను జిరాక్స్ తీసుకుంటున్నారు. వీటికోసం రూ.5 వేల వరకు ఖర్చుచేయాల్సి వస్తోంది. యూట్యూబ్‌లో కొందరు సబ్జెక్టు నిపుణులు గ్రూప్-1, 2 సబ్జెక్టులు, చరిత్ర, కరెంట్ అఫైర్స్ తదితర సమాచారాన్ని వీడియోల రూపంలో అప్‌లోడ్ చేస్తున్నారు. గ్రంథాలయాల్లో సన్నద్ధమవుతున్న, గతంలో ఒకసారి కోచింగ్ తీసుకున్నవారికి ఈ సమాచారం ఉపయుక్తంగా మారుతోంది.
టీఎస్‌పీఎస్సీ > గ్రూప్-4 > స్టడీమెటీరియల్
2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3. నిత్య జీవితంలో సామాన్య శాస్త్రం
4. పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ
5. భారతదేశం, తెలంగాణ భూగోళశాస్త్రం, ఆర్థికశాస్త్రం
7 భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం
8 భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.