• facebook
  • whatsapp
  • telegram

గ్రూప్‌-1 ఇంట‌ర్వ్యూల‌ నిర్వ‌హ‌ణ‌పై హైకోర్టు స్టే

షెడ్యూలు ప్రకారం జూన్ 17 నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు

‣ నాలుగు వారాలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు  

 

 


రాతపరీక్షలో మార్కులు అభ్యర్థుల జీవితాల్ని మారుస్తాయి. రాష్ట్రంలో అధికారుల నియామకానికి గ్రూప్‌-1 పరీక్ష కీలకమైంది. గ్రూప్‌-1 సివిల్‌ సర్వెంట్లను నియమించే గొప్ప బాధ్యతను ఏపీపీఎస్సీపై అధికరణ 315 నుంచి 320 ప్రకారం రాజ్యాంగం కల్పించింది. ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం.. పరీక్షకు సంబంధించిన అంశాల్ని మదింపు చేసే అధికారం ఛైర్మన్‌కు ఉంది. నిబంధన 17 ప్రకారం పరీక్ష నిర్వహించారా.. లేదా అనే విషయం స్పష్టంగా లేదు. 2020 అక్టోబరు 28న నిర్వహించిన సమావేశానికి ఛైర్మన్‌ హాజరుకాకపోవడానికి కారణాలేవీ కోర్టుకు సమర్పించిన వివరాల్లో లేవు.
 

ఏపీపీఎస్సీ మూల్యాంకనం కోసం థర్డ్‌పార్టీని ఎంపిక చేసే విషయంలో ఎలాంటి విధివిధానాలను పాటించారో చెప్పలేదు. మూల్యాంకనం చేసినవారి అర్హతలపై పిటిషనర్లు అభ్యంతరం లేవనెత్తినప్పుడు.. కనీసం వారి అర్హతలు, పూర్వ అనుభవం వెల్లడించాల్సిన బాధ్యత ఏపీపీఎస్సీపై ఉంది. కౌంటర్‌ అఫిడవిట్లో ఆ వివరాల ప్రస్తావన లేదు.   - హైకోర్టు
 

ఈనాడు - అమరావతి: ఏపీలో జూన్ 17 నుంచి నిర్వహించనున్న గ్రూప్‌-1 ఇంటర్వ్యూలతోపాటు తదుపరి చర్యలన్నింటినీ నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పరీక్ష ప్రక్రియ ప్రారంభమయ్యాక నిబంధనలను మార్చినట్లు ప్రాథమికంగా అభిప్రాయపడింది. తమ జవాబు పత్రాలను కోర్టు ముందు ఉంచేలా ఆదేశించాలని కోరుతూ పిటిషనర్లు వేసిన అనుబంధ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీపీఎస్సీతోపాటు ఇతర ప్రతివాదులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు జూన్ 16న‌ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ వ్యాజ్యాలపై లోతైన విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, పరీక్షను మళ్లీ నిర్వహించాలని, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. జూన్‌ 17 నుంచి నిర్వహించనున్న ఇంటర్వ్యూలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని పిటిషనర్లు కోరారు. దీనిపై న్యాయమూర్తి నిర్ణయాన్ని వెల్లడించారు. ‘ఏపీపీఎస్సీ నిబంధన 17 ప్రకారం పరీక్ష విధివిధానాల్లో మార్పులుంటే ఆ విషయాన్ని దాంతో సంబంధం ఉన్నవారందరికీ తెలియ జేయాలి. డిజిటల్‌ మూల్యాంకనంలో తప్పులు దొర్లితే మరోసారి పేపర్లు దిద్దాలని హైకోర్టు గతంలో ఆదేశించింది. జూన్‌ 17 నుంచి ఇంటర్వ్యూలు కొనసాగితే.. అర్హత ఉన్న అభ్యర్థుల హక్కులు నిరాకరణకు గురయ్యే అవకాశం ఉంది. పిటిషనర్లకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఆ నష్టాన్ని తిరిగి భర్తీ చేయలేం. ఈ నేపథ్యంలో 2018 డిసెంబరు 31న ఇచ్చిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి జూన్‌ 17న నిర్వహించనున్న ఇంటర్వ్యూలతో పాటు తదుపరి చర్యలన్నింటినీ నాలుగు వారాలపాటు నిలువరిస్తున్నాం’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో తెలిపారు.పరీక్ష ప్రక్రియ ప్రారంభమయ్యాక నిబంధనలను మార్చారు

పిటిషనర్ల తరఫున సీనియరు న్యాయవాదులు బి.ఆదినారాయణరావు, జి.విద్యాసాగర్‌, న్యాయవాదులు మోటుపల్లి విజయ్‌ కుమార్‌, జె.సుధీర్‌, జీవీ శివ, టీడీ ఫణికుమార్‌, తాండవ యోగేష్‌ వాదనలను వినిపించారు. ‘జవాబు పత్రాలను డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేయడం అభ్యంతరకరం. అది చట్టవిరుద్ధం. చరిత్ర, ఏపీ సంస్కృతి, భౌగోళిక శాస్త్రం తదితర సబ్జెక్టుల జవాబు పత్రాల్ని లోతైన అవగాహన ఉన్నవాళ్లే దిద్దగలరు. ఆ పేపర్లు దిద్దినవారు నిపుణులా కాదా అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా థర్డ్‌పార్టీ ద్వారా జవాబు పత్రాల మూల్యాంకనం చేయించారు. పరీక్ష ప్రక్రియ ప్రారంభమయ్యాక నిబంధనలను మార్చారు’ అని పేర్కొన్నారు.
ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాది మల్లికార్జునరావు వాదనలను వినిపిస్తూ.. ‘డిజిటల్‌ మూల్యాంకనం గురించి అభ్యర్థులకు ముందుగా తెలుసు. కొన్ని పరిస్థితులవల్ల ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ సమావేశాలకు హాజరు కాలేదు. నిపుణులైన థర్డ్‌ పార్టీ ద్వారా పరీక్ష పేపర్లు దిద్దించాలని కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. పరీక్ష నిబంధనలను మార్చలేదు’ అని తెలిపారు.

 

‣ మౌఖిక పరీక్ష వాయిదా
హైకోర్టు ఆదేశాలతో విజయవాడలో గురువారం నుంచి జరగాల్సిన గ్రూప్‌-1 ఉద్యోగాల మౌఖిక పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ బుధవారం ప్రకటించింది. తదుపరి తేదీలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది.

 

‣ వివాదమేంటి?

గ్రూప్‌-1 ఉద్యోగాల నియామక ప్రక్రియ మూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. 2018 డిసెంబరులో ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. 2019 మే 26న ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. అదే ఏడాది అక్టోబరులో ఫలితాలు వెల్లడించారు. వివిధ కారణాలతో ప్రధాన (మెయిన్స్‌) పరీక్షల నిర్వహణ తేదీలు ఐదు సార్లు మారాయి. చివరికి వాటిని గతేడాది డిసెంబరు 14 నుంచి 20 వరకు నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 28న ఫలితాలు ప్రకటించారు. మౌఖిక పరీక్షలకు ఎంపిక కాలేదని ఆందోళనకు గురైన పలువురు అభ్యర్థులు జవాబుపత్రాల మూల్యాంకనం సక్రమంగా జరగలేదని, ఆన్‌లైన్లో మూల్యాంకనం చేసినవారి అర్హతలేంటో కూడా తమకు తెలియలేదని.. అందువల్ల మార్కులు నష్టపోయామని ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం వెలువడిన ఆదేశాలతో గురువారం నుంచి జరగాల్సిన మౌఖిక పరీక్షలు వాయిదా పడ్డాయి.


 

‣ అప్పుడలా.. ఇప్పుడిలా

గతంలో గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల జవాబు పత్రాలను ఏపీపీఏస్సీ నిర్వహించే క్యాంప్‌లో ప్రొఫెసర్లు పాల్గొని.. నేరుగా మూల్యాంకనం చేసేవారు. ఒక్కో పేపరును ఇద్దరు ప్రొఫెసర్లతో దిద్దించేవారు. వారిద్దరు ఇచ్చిన మార్కుల్లో 15% లేదా అంతకంటే ఎక్కువ తేడా వస్తే.. మూడోసారి వేరేవారితో దిద్దించేవారు. అయితే, ఈసారి ప్రశ్నపత్రాలు కాకుండా.. ప్రశ్నలను ట్యాబ్‌లలో ఇచ్చారు. జవాబు పత్రాలను స్కానింగ్‌ చేసి, ఎంపిక చేసిన ప్రొఫెసర్లకు ఆన్‌లైన్‌లో పంపారు. వాటిని ప్రొఫెసర్లు ఆన్‌లైన్‌లోనే మూల్యాంకనం చేశారు. దీంతో మూల్యాంకన క్యాంపు నిర్వహించలేదు.

 

‣ తప్పుల తడక..

2018 నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రిలిమ్స్‌లో ఇచ్చిన ప్రశ్నల తెలుగు అనువాదంలో తప్పులు దొర్లాయి. దీనిపై కొందరు న్యాయపోరాటం చేయగా.. హైకోర్టు ఆదేశాలతో ‘కీ’ సరిచేశారు. దీంతో రెండుసార్లు ఫలితాలు ప్రకటించాల్సి వచ్చింది. 2011లో నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లోనూ తప్పులు దొర్లాయి. ఈ నియామకాల మౌఖిక పరీక్షలు రద్దయ్యాయి. మళ్లీ ప్రధాన పరీక్షల నుంచి నిర్వహించారు. 2016 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ప్రకారం చేపట్టిన నియామకాల్లోనూ చిన్న చిన్న సమస్యలొచ్చాయి. ఇలా వరుస లోపాలతో నియామకాలు ఆలస్యం అయ్యేకొద్దీ.. ఉన్నతోద్యోగాల్లో చేరాల్సిన అభ్యర్థులు సర్వీసుపరంగా కూడా నష్టపోతున్నారు.

 

Posted Date : 16-06-2021