సిరిసిల్ల జిల్లాలో పాల్గొననున్న మంత్రులు కేటీఆర్, సబిత
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పనులు పూర్తయిన సుమారు 680 పాఠశాలలను ఫిబ్రవరి 1న ప్రారంభించనున్నారు. అధికారికంగా మాత్రం ఎన్ని పాఠశాలలన్నది ప్రభుత్వం చెప్పడం లేదు. తొలి విడతలో రాష్ట్రంలోని 9,123 పాఠశాలలను ఎంపిక చేసిన ప్రభుత్వం రూ.3,497 కోట్లతో 12 రకాల సౌకర్యాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత మార్చిలో సీఎం కేసీఆర్ వనపర్తిలో కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మండలానికి కనీసం రెండు చొప్పున 1210 పాఠశాలలను ప్రారంభించాలని రెండు మూడు నెలలుగా అధికారులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతానికి 680 పాఠశాలలు సిద్ధం కావడంతో వాటిని ఫిబ్రవరి 1న ఒకేసారి మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రారంభించాలని నిర్ణయించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ నుంచి పీజీ విద్యా ప్రాంగణాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు, గ్రీన్ చాక్ బోర్డులు, మరమ్మతులు, డిజిటల్ విద్య అందించేందుకు పరికరాలు, ప్రహరీలు, వంట గది, డ్యూయల్ డెస్కులు, ఉన్నత పాఠశాలలైతే భోజనశాలలు తదితర 12 రకాల సౌకర్యాలు కల్పించారు. సుమారు మరో 600 పాఠశాలలను కొద్ది రోజుల్లోనే ప్రారంభిస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో విద్యకు పెద్దపీట: మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు జనవరి 31న ట్విటర్‌లో తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మన ఊరు- మనబడి పథకంలో భాగంగా కేజీ నుంచి పీజీ విద్యాప్రాంగణాన్ని అద్భుతంగా రూపొందించినట్లు తెలిపారు. బుధవారం తాను విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి ఈ ప్రాంగణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అక్కడ అంగన్‌వాడీ నర్సరీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, హైస్కూలు, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలు, గ్రంథాలయం, ప్రయోగశాలలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రం నిర్మించినట్లు పేర్కొంటూ వాటి ఫొటోలు జత చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నీట్‌లో మేటిస్కోరుకు మెలకువలు!
‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.