* ఆదివారం నాటికి 10వేల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నట్లు అధికార వర్గాల వెల్లడి
దిల్లీ: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ నియామకాలకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఈ పథకం కింద వాయుసేనలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవ్వగా.. దాదాపు 3లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జులై 1 నుంచి నేవీ, ఆర్మీల్లోనూ ఈ పథకం కింద నియామక ప్రక్రియ మొదలైంది. కాగా.. అగ్నిపథ్‌లో భాగంగా నావికాదళంలో చేరేందుకు దాదాపు 10వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తొలిసారిగా నావికాదళంలో మహిళలను సెయిలర్లుగా నియమించుకునేందుకు భారత నేవీ అంగీకరించింది. అగ్నివీర్ పథకంలో భాగంగా సెయిలర్ల కోసం మహిళల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. అవసరమైతే వారికి యుద్ధనౌకల్లోనూ విధులకు పంపనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే జులై 1న నేవీలో అగ్నివీరుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవ్వగా.. జులై 03 నాటికి 10వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే మొత్తం ఎన్ని రిజిస్ట్రేషన్లు వచ్చాయన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం నేవీలో అగ్నివీరుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జులై 15 నుంచి 30 వరకు అప్లికేషన్లను తీసుకోనున్నారు. అక్టోబరులో రాత పరీక్ష, శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించి నవంబరు నుంచి శిక్షణ ప్రారంభించనున్నారు.
ఈ ఏడాది 3000 మంది అగ్నివీరులను నియమించుకోవాలని భావిస్తున్నామని, ఇందులో మహిళలు కూడా ఉంటారని ఇటీవల నేవీ ప్రకటించింది. అయితే ఈ సంఖ్యపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఈ అగ్నివీరులకు నవంబరు నుంచి ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. మహిళలకు కూడా శిక్షణ ఇవ్వనున్న నేపథ్యంలో, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తోన్నట్లు వెల్లడించింది.
త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కింద 17.5 సంవత్సరాల నుంచి 23 ఏళ్ల వయసు కలిగిన యువతను అర్హులుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. నాలుగేళ్ల సర్వీసుపై పనిచేయాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. వీరిలో 25శాతం మందిని శాశ్వత ప్రాతిపదికన మళ్లీ సర్వీసులోకి తీసుకుంటామంది. నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు రక్షణశాఖ, కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో 10 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!
‣ ప్రపంచ దృక్పథంతో నలంద కోర్సులు
‣ 'మహీంద్రా'లో కొత్త ఎంటెక్ కోర్సులు
‣ సరిహద్దు రహదారుల సంస్థలో ఉద్యోగాలు
‣ మేనేజ్మెంట్ విద్యలో ఆకర్షణీయ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.