• facebook
  • whatsapp
  • telegram

Inspire Manak: ఇన్‌స్పైర్‌ మనక్‌ నమూనాలకు నాలుగు రోజులే గడువు 

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డులు దక్కించుకోవడంలో రాష్ట్రంలో జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. ఈ సారి కూడా అదే గుర్తింపు పొందేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. కొవిడ్, ఇతర కారణాల వల్ల ఈసారి రాష్ట్రస్థాయిలో ఆశించిన స్థాయిలో నమూనాలు రాకపోవడంతో ప్రభుత్వం అక్టోబరు 23 వరకు గడువు పొడిగించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యాన్ని సాధించేందుకు జిల్లా అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు.
లక్ష్యం 4వేలు... వచ్చింది 2,500
శాస్త్రసాంకేతిక, విజ్ఞాన రంగాల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఏటా జాతీయస్థాయిలో ఇన్‌స్పైర్‌ మనక్‌ పోటీలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులను ప్రోత్సహించే దిశగా ఒక్కో ప్రదర్శనకు రూ.10వేల ప్రోత్సాహం కూడా అందిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 4వేల నమూనాలు వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించగా ఇప్పటివరకు 2,500 నమూనాలు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం గడువు పెంచడంతో లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లావిద్యాశాఖనుంచి ఎమ్యీవోలు, డీవైఈవోలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయా మండలాల అధికారులు ఆదిశగా చర్యలు తీసుకుంటున్నారు. గడువు నాలుగు రోజులే ఉండటంతో ఎన్ని వస్తాయో చూడాలి.
ప్రయివేటు పాఠశాలల భాగస్వామ్యం 10శాతమే..  జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన వాటిని పరిశీలిస్తే ప్రయివేటు పాఠశాలల భాగస్వామ్యం కేవలం 10 శాతం మాత్రమే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 500 ప్రయివేటు పాఠశాలలు ఉంటే  కేవలం 73 పాఠశాలల నుంచి 400 వరకు దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన యాజమాన్యాలు కూడా దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలి. హైస్కూల్‌ నుంచి 5, ప్రాథమికోన్నత పాఠశాలనుంచి 3 చొప్పున నమూనాలు రావాలనేది నిబంధన. ప్రభుత్వ పాఠశాలల పరంగా వచ్చిన వాటిని పరిశీలించినా ప్రాథమికోన్నత పాఠశాలలనుంచి వచ్చినవి ఎక్కువ. ఉన్నత పాఠశాలల నుంచి తక్కువ వచ్చినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలపరంగా కూడా వివిధ మండలాలు వెనుకబడి ఉన్నాయి. ఆగిరిపల్లి, అవనిగడ్డ, చాట్రాయి, జి.కొండూరు, గూడూరు, కలిదిండి, మండవల్లి, ముసునూరు, నందివాడ, పమిడిముక్కల, పెదపారుపూడి, తిరువూరు, తోట్లవల్లూరు, ఉంగుటూరు, విజయవాడ రూరల్‌ మండలాలు వెనుకబడి ఉన్నాయి. ఈ మండలాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఎంఈవోలకు ఆదేశాలు: తాహెరా సుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారి
గతంతో పోల్చితే ఈ ఏడాది వచ్చిన నమూనాల సంఖ్య తక్కువగా ఉంది. దీనిపై సమీక్షించగా ప్రయివేటు పాఠశాలల భాగస్వామ్యం తక్కువగా ఉంది. జిల్లాలో 15 మండలాల నుంచి తక్కువ సంఖ్యలో వచ్చాయి. ఎంఈవోలు, డీవైఈవోలతో సమీక్షించి స్పష్టమైన ఆదేశాలు జారీచేశాం. స్పందించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఇచ్చిన గడువును వినియోగించుకుని లక్ష్యం మేర నమూనాలు వచ్చేలా అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం.

Posted Date : 20-10-2021