ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు
ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈఏపీసెట్)లో ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగించారు. ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఇంటర్ రెండో ఏడాది చదివిన విద్యార్థులు మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు కరోనా కారణంగా మార్చిలో పరీక్షలు నిర్వహించలేదు. విద్యార్థులందరికీ ఉత్తీర్ణత మార్కులు ఇచ్చారు. ఎవరైనా మార్కులు ఎక్కువ కావాలనుకుంటే సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవాలని ఇంటర్ విద్యామండలి సూచించింది. చాలా మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఎవరైనా అభ్యర్థులు ఈ పరీక్షలు రాయకపోతే నష్టపోతారనే ఉద్దేశంతో ఇంటర్ మార్కులను వెయిటేజీని తొలగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈఏపీసెట్‌ను 160 మార్కులకు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా ఇంటర్లో 30శాతం పాఠ్యప్రణాళిక తగ్గించినందున ప్రవేశ పరీక్షలోనూ ఆ పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఇవ్వరు.
జూనియర్ కళాశాలల పునఃప్రారంభం జూన్ 20న
జూనియర్ కళాశాలలను జూన్ 20న పునఃప్రారంభించాలని ఇంటర్ విద్యామండలి ప్రాథమికంగా నిర్ణయించింది. మొదటి ఏడాది ప్రవేశాలను ఆన్లైన్లో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఆన్లైన్ ప్రవేశాలపై సిఫార్సుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను ఇంటర్ విద్యామండలికి సమర్పించింది. త్వరలో ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నారు. ఆన్లైన్ ప్రవేశాలను జూన్‌లోపు పూర్తి చేసి, మొదటి సంవత్సరం వారికి జులై ఒకటి నుంచి తరగతులు ప్రారంభించాలని భావిస్తోంది.
పదోతరగతి మార్కులతోనే ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలు
పదో తరగతి మార్కుల ఆధారంగానే ఈ ఏడాది ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లు పదో తరగతి పరీక్షలు నిర్వహించనందున ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు నిర్వహించారు. ఈ ఏడాది పరీక్షలు నిర్వహించారు. వీటిలో వచ్చే మార్కుల ఆధారంగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు కొంత వెయిటేజీ ఉంటుంది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ప్రాంగణాల్లో నాలుగు వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా 10శాతం ఈడబ్ల్ల్యూఎస్ కోటా సూపర్‌న్యూమరీ సీట్లు ఉంటాయి.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ విద్యార్థులూ... కళ్లను నిర్లక్ష్యం చేయకండి!
‣ ఉద్యోగం సాధించాలనే తపన మీలో ఉందా?
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat and Google News
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.