• facebook
  • whatsapp
  • telegram

Inter Admissions: నేటి నుంచి ఇంటర్‌ ఆఫ్‌లైన్‌ ప్రవేశాలు 

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ఆఫ్‌లైన్‌ ప్రవేశాలకు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌ ప్రవేశాలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ఆఫ్‌లైన్‌ ప్రవేశాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కళాశాలలు సెప్టెంబర్‌ 19 నుంచి దరఖాస్తుల విక్రయం ప్రారంభిస్తాయి. సెప్టెంబర్‌ 28లోపు దరఖాస్తుల స్వీకరణ, ప్రవేశాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. 29 నుంచి విద్యార్థులకు ఆఫ్‌లైన్‌ తరగతులు ప్రారంభమవుతాయి. పదోతరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రం, కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన అనంతరం యాజమాన్యాలు విద్యార్థులకు తిరిగి ఇచ్చేయాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చెల్లించిన ఫీజును బోర్డు గుర్తింపునకు విద్యార్థి చెల్లించే రూ.200 రుసుములో మినహాయించనున్నారు. ప్రవేశాల్లో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 29%, దివ్యాంగులకు 3%, ఎన్‌సీసీ, క్రీడా కోటాకు 5%, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, సైనికోద్యోగుల పిల్లలకు 3% రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో మొదటి సంవత్సరం చదివిన వారికి రెండో సంవత్సరంలో ప్రవేశానికి అవకాశం లేదు. ఏపీలో చదవాలంటే మొదటి ఏడాదిలో చేరాల్సి ఉంటుంది. ఎన్ని సెక్షన్లు మంజూరయ్యాయి? ఎన్ని సీట్లు నిండాయి?అనే వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలని కార్యదర్శి ఆదేశించారు.

Posted Date : 19-09-2021