• facebook
  • whatsapp
  • telegram

JEE Advanced: ఎంత కష్టమో జేఈఈ అడ్వాన్స్‌డ్‌!

* ఒక్కో సబ్జెక్టులో 120కి 20 మార్కులు పొందటమే గగనం

* గణితంలో 20 మార్కులు దక్కించుకున్నది 1200 మందే

* అడ్వాన్స్‌డ్, జోసా-2022పై నివేదికను విడుదల చేసిన ఐఐటీ బాంబే

* ఐఐటీ తిరుపతిలో అత్యధికంగా 20.7 శాతం అమ్మాయిలకు సీట్లు

 

 

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించడమే కాదు.. ఒక్కో సబ్జెక్టులో 120 మార్కులకు 20 దక్కించుకోవడమూ గగనంగా మారింది. ఆ మాత్రం పొందేవారు కూడా మొత్తం విద్యార్థుల్లో అతి స్వల్పంగా ఉంటున్నారు. గణితంలో వారు కేవలం 1200 మందే ఉన్నట్లు స్పష్టమైంది. తాజాగా ఐఐటీ బాంబే జేఈఈ అడ్వాన్స్‌డ్, జోసా కౌన్సెలింగ్‌పై సమగ్ర నివేదికను విడుదల చేసింది. గత ఆగస్టు 28న పరీక్ష జరపగా.. జోసా కౌన్సెలింగ్‌ అక్టోబరు 17కి ముగిసింది. పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులు, వారి సంఖ్య తదితర వివరాలను అందులో పొందుపరిచింది. రసాయనశాస్త్రంలో 120 మార్కులకు 20 దాటినవారు 2వేలు, భౌతికశాస్త్రంలో 4వేల మందే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసినవారు 1.55 లక్షల మంది ఉన్నారు. దీన్ని బట్టి అడ్వాన్స్‌డ్‌- 2022లో గణితం సబ్జెక్టు బాగా కఠినంగా ఉన్నట్లు స్పష్టమవుతుందని నానో అకాడమి డైరెక్టర్‌ కృష్ణ చైతన్య తెలిపారు. అంతేకాక రసాయనశాస్త్రం కంటే భౌతికశాస్త్రం సులభమని తేలుతుందన్నారు. వాస్తవానికి పరీక్ష జరిగిన ఆగస్టు 28న రసాయనశాస్త్రం సులభంగా ఉందని నిపుణులు చెప్పినా.. తాజా నివేదికను బట్టి భౌతికశాస్త్రమే సులువుగా ఉన్నట్లు తేటతెల్లమైంది. గత ఏడాది జనరల్‌ కేటగిరీలో కటాఫ్‌ మార్కులు 63 (306 మార్కులకు పరీక్ష) కాగా... ఈసారి అది 55కి తగ్గింది. అంటే 55 మార్కులు వచ్చిన వారు జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఏటా ప్రశ్నపత్రాల స్థాయి కఠినంగా మారుతోందా? విద్యార్థుల సబ్జెక్టు స్థాయి తగ్గుతోందా? అన్నదానిపై ఐఐటీ ఆచార్యులు అధ్యయనం చేయాలని నిపుణులు కోరుతున్నారు.

 

మరికొన్ని ముఖ్యాంశాలు...

* ఈసారి మొత్తం 3,310 మంది బాలికలకు సీట్లు దక్కాయి. అంటే మొత్తం సీట్లలో 20.06 శాతంతో సమానం. అత్యధికంగా తిరుపతి ఐఐటీలో 20.7 శాతం మంది సీట్లు పొందగా అతి తక్కువగా ఐఐటీ ఖరగ్‌పుర్‌లో 17.7 శాతం మందికే ప్రవేశాలు లభించాయి.

* విదేశీ విద్యార్థులు మొత్తం 145 మంది అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైనా 66 మందే ప్రవేశాలు పొందారు.

* దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులతో పాటు సుప్రీం కోర్టులో జేఈఈ అడ్వాన్స్‌డ్, జోసా కౌన్సెలింగ్‌పై 42 కేసులు దాఖలయ్యాయి.

* ఈసారి అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైనవారు 40,712 మంది. ఓపెన్‌(సీఆర్‌ఎల్‌) కేటగిరీలో చివరి ర్యాంకు 28,978. ఆ విద్యార్థికి గణితంలో 6, భౌతికశాస్త్రంలో 29, రసాయన శాస్త్రంలో 20... మొత్తం 55 మార్కులు దక్కాయి. ఒక్కో సబ్జెక్టుకు మొత్తం మార్కులు 120. అదే ఈడబ్ల్యూఎస్‌లో చివరి ర్యాంకు 4,988 కాగా.. వరుసగా 7, 31, 12... మొత్తం 50 వచ్చాయి. ఓబీసీలో చివరి ర్యాంకు 9,221. ఆ విద్యార్థికి వరుసగా 10, 28, 12... మొత్తం 50 మార్కులు దక్కాయి. ఎస్‌సీలో 3, 22, 3... మొత్తం 28, ఎస్‌టీ కేటగిరీలో 3, 13, 12... మొత్తం 28 మార్కులు పొందారు.

* తొలి 50 ర్యాంకర్లలో 46 మంది బాంబేలో చేరగా.. దిల్లీ, మద్రాస్‌లో ఒక్కొక్కరు చొప్పున ప్రవేశం పొందారు. అంటే ఇద్దరు ఏ ఐఐటీలోనూ చేరలేదు. అందులో తొలి ర్యాంకు పొందిన ఆర్‌కే శిశిర్‌ ఐఐటీకి బదులు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ)లో బీటెక్‌ మేథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌ కోర్సులో చేరాడు. ఈ సంస్థలో తొలిసారిగా ఈ ఏడాదే ఈ కోర్సును అందుబాటులోకి తెచ్చారు.

* తొలి వెయ్యి ర్యాంకర్లలో బాంబే- 246, దిల్లీ- 210, మద్రాస్‌-110, కాన్పుర్‌-107, ఖరగ్‌పుర్‌- 93, గువాహటి- 66, రూర్కీ- 60, హైదరాబాద్‌- 40, వారణాసి- 31, ఇందోర్‌- 7, రోపర్‌లో ఒకరు వంతున చేరారు.


********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఒకేసారి గ్రూప్స్‌ అన్ని నోటిఫికేషన్లు వస్తే ఏంచేయాలి?

‣ ఏపీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నెగ్గేదెలా?

‣ టెన్త్‌తో రక్షణదళంలో ఉద్యోగం

‣ డిగ్రీ అభ్యర్థులకు మూడేళ్ల ప్రణాళిక!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.