• facebook
  • whatsapp
  • telegram

మొదటి 100 ర్యాంకుల్లో 40 మనోళ్లకే!  

* జేఈఈ మెయిన్‌లో తెలుగు విద్యార్థుల విజయబావుటా

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌లో మొదటి 100 ర్యాంకుల్లో దాదాపు 40 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఉన్నారు. మార్కులు సమానంగా వచ్చినప్పుడు పెద్ద వయసును పరిగణనలోకి తీసుకొని ముందు ర్యాంకు కేటాయించే విధానాన్ని ఈసారి మార్చడంతో ఆరుగురికి ప్రథమ ర్యాంకు వచ్చింది. జోస్యుల వెంకట ఆదిత్యకు 2వ ర్యాంకు, ఏపీకి చెందిన లోకేష్‌రెడ్డి 4, పునీత్‌కుమార్‌-6, రోహిత్‌కుమార్‌రెడ్డి-7 మహంత్‌నాయుడు- 13, సత్తి కార్తికేయ 16, కార్తికేయ సాయి వైదిక్‌ 17వ ర్యాంకు.. ఇలా తొలి 100లో 40 మంది వరకు మన విద్యార్థులు ఉన్నారు. ఒక కార్పొరేట్‌ కళాశాల విద్యార్థులే మొదటి 100 ర్యాంకుల్లో 18మంది ఉన్నారు.
100 పర్సంటైల్‌లో 13 మంది మనోళ్లే
ఈసారి 100 పర్సంటైల్‌(100 ఎన్‌టీఏ స్కోర్‌) సాధించిన వారు దేశవ్యాప్తంగా 44 మంది ఉన్నారు. వారిలో ఏపీ నుంచి ఆరుగురు, తెలంగాణ నుంచి ఏడుగురు చొప్పున ఉండటం గమనార్హం. వారిలో ఆరుగురికి ప్రథమ ర్యాంకు దక్కగా... మిగిలిన వారు ఆ తర్వాత ర్యాంకు పొందారు.
300 మార్కులొచ్చినా... తొలి ర్యాంకు దక్కలేదు
మొత్తం 300కి 300 మార్కులు సాధించిన వారిలో కొందరికి మాత్రం తొలి ర్యాంకు ఇవ్వలేదు. ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన జోస్యుల వెంకట ఆదిత్య నాలుగు సార్లు పరీక్షలు రాయగా మూడో విడతలో 300 మార్కులు సాధించాడు. అయినా రెండో ర్యాంకుకే పరిమితమయ్యాడు. దీనిపై జేఈఈ నిపుణుడు ఎం.ఉమాశంకర్‌ మాట్లాడుతూ ర్యాంకులు కేటాయించేటప్పుడు మిగిలిన మూడు పరీక్షల్లో వచ్చిన స్కోర్‌తో పాటు రుణాత్మక మార్కుల(మైనస్‌)ను కూడా పరిగణనలోకి తీసుకున్నారన్నారు. ఈసారి ర్యాంకుల కేటాయింపులో ఇద్దరికి ఒకే మార్కులు లేదా స్కోర్‌ వస్తే వయసుకు బదులు రుణాత్మక మార్కులు లెక్కలోకి తీసుకొని...తక్కువ మైనస్‌ మార్కులు ఉన్నవారికి ముందు ర్యాంకు ఇస్తామని జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు. అయితే అభ్యర్థి అత్యధిక స్కోర్‌ సాధించిన విడతలోని మార్కులే కాకుండా అతను రాసిన ఇతర విడతల పరీక్షల్లో స్కోర్‌ను కూడా లెక్కలోకి తీసుకుంటారన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదని ఆయన తెలిపారు.


 

Posted Date : 16-09-2021