* సగం సమయం గణితం ప్రశ్నలకే..
* భౌతిక శాస్త్రం కాస్త నయం..
* తొలిరోజు పరీక్షలపై నిపుణుల అభిప్రాయం
ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, మల్లాపూర్: తొలిరోజు (జనవరి 23న) జేఈఈ మెయిన్ ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నట్లు నిపుణులు తెలిపారు. గణితం ప్రశ్నలకు ఎక్కువ సమయం పట్టిందని, వాటికే దాదాపు సగం సమయం (80 - 90 నిమిషాలు) అవసరమైందని చెబుతున్నారు. జాతీయ సాంకేతిక విద్యాసంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా మంగళవారం జేఈఈ మెయిన్ పరీక్షలు ఆన్‌లైన్‌లో ప్రారంభమయ్యాయి. పరీక్ష అంత కఠినంగా లేదని, తప్పకుండా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తామని పలువురు విద్యార్థులు తెలిపారు. గంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలు/పట్టణాల్లో ఈ పరీక్ష జరిగింది.
30 గణితం ప్రశ్నలకు 90 నిమిషాలు...
మొత్తం 300 మార్కుల ప్రశ్నపత్రంలో గణితం, భౌతిక, రసాయనశాస్త్రాల ప్రశ్నలు 90 ఇచ్చారు. అంటే ఒక్కో దాంట్లో 30 ప్రశ్నలు. గణితం ప్రశ్నలు అన్నింటినీ పరిష్కరించాలంటే 80 - 90 నిమిషాలు పడుతుందని శ్రీచైతన్య విద్యాసంస్థల జాతీయ ఐఐటీ కోఆర్డినేటర్ ఎం.ఉమాశంకర్ చెప్పారు. అందులో చాలామంది ఆరు ప్రశ్నలు చేయగలుగుతారన్నారు. ఎక్కువ మందికి 300కి 300 మార్కులు రాకుండా.. ఉన్నత ప్రమాణాలతో గణితం ప్రశ్నలు ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. భౌతికశాస్త్రం ప్రశ్నలు మధ్యస్థంగా, రసాయనశాస్త్రం ప్రశ్నలు కొంత సులభంగా ఉన్నాయని చెప్పారు. రసాయనశాస్త్రంలో అధికంగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ నుంచి వచ్చాయని, అందులో ఎక్కువమంది 12 ప్రశ్నలకు జవాబులు గుర్తించగలుగుతారని తెలిపారు. కొన్ని ప్రశ్నలు గందరగోళానికి గురిచేసేలా ఉన్నాయని చెప్పారు. ర్యాంకింగ్‌లో గణితం, రసాయనశాస్త్రం ప్రశ్నలు కీలకంగా మారతాయన్నారు. గత ఏడాది గణితంతో పోల్చుకుంటే ఈసారి ప్రశ్నలు సులభంగానే ఉన్నాయని నానో అకాడమీ డైరెక్టర్ కాసుల కృష్ణ చైతన్య తెలిపారు. భౌతిక, రసాయన శాస్త్రాల్లో ప్రశ్నలు.. గత ఏడాది మాదిరిగానే సులభంగా ఉన్నాయని చెప్పారు. ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉదయం పేపర్‌లో 290కిపైగా, రెండో సెషన్‌లో 285పైగా మార్కులు సాధించే అవకాశం ఉందని తెలిపారు. ‘మధ్యాహ్న సెషన్‌లో గణితం, రసాయన శాస్త్రంలో కొన్ని ప్రశ్నలు కష్టంగా ఉన్నాయి. గణితంలో బహుళ సంభావ్యత ప్రశ్నల కారణంగా చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు’ అని శారద విద్యా సంస్థల జనరల్ మేనేజర్ జి.విఘ్నేశ్వరరావు తెలిపారు.
తొలిరోజు రెండు చోట్ల ఆలస్యంగా పరీక్ష ప్రారంభం
* హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ కేంద్రంలో పరీక్ష ప్రారంభం కావడం గంట ఆలస్యమైంది. దీంతో విద్యార్థులకు అదనంగా గంట సమయం కేటాయించారు. మౌలాలిలోని పరీక్ష కేంద్రంలోనూ అరగంట ఆలస్యం కాగా.. అక్కడ ఆమేర అదనపు సమయం ఇచ్చారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ అందరి అవసరాలకు అందుబాటులో కోర్సులు!
‣ నీట్‌లో మేటిస్కోరుకు మెలకువలు!
‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.