• facebook
  • whatsapp
  • telegram

KU Distance Exams: కేయూ దూరవిద్యా డిగ్రీ, పీజీ పరీక్షల కేంద్రాల కేటాయింపు ఎప్పుడు..?

కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు మరో రెండు రోజులు మాత్రమే ఉండగా ఇప్పటి వరకు కేంద్రాల కేటాయింపు ప్రక్రియ జరగలేదు. దీంతో పరీక్షలు వాయిదా పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 2019-2020 విద్యాసంవత్సరాల విద్యార్థులకు సెప్టెంబరు 20వ తేదీ నుంచి పరీక్షలు ఉంటాయని కేయూ పరీక్షల నియంత్రణ అధికారులు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. గత ఏడాది మేలో జరగాల్సిన ఈ పరీక్షల నిర్వహణకు వీసీ ఆచార్య టి.రమేష్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత సమీక్షించి అన్ని అడ్డంకులను తొలగించారు. ఎట్టకేలకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. డిగ్రీ ప్రథమ, రెండు, పీజీ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల్లో పరీక్షలు ఉండగా అధికారులు మాత్రం ఇంతవరకు కేంద్రాలను కేటాయించలేదు. దీంతో రాష్ట్రంలోని పలు అధ్యయన కేంద్రాల నిర్వాహకులు సెప్టెంబరు 17న దూర విద్యా కేంద్రానికి వచ్చారు. తమ జిల్లాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. దూరవిద్యాకేంద్రం సంచాలకుడు అందుబాటులో లేకపోవడంతో వాళ్లు కేయూ ఉపకులపతి ఆచార్య టి.రమేష్‌ను కలవగా వారి డిమాండ్‌ను పరిశీలిస్తామన్నారు. ఈనేపథ్యంలోనే పరీక్షల నిర్వహణ వాయిదా పడే అవకాశాలున్నాయి.

Posted Date : 18-09-2021