• facebook
  • whatsapp
  • telegram

Medical Colleges: అమ్మకానికి ప్రభుత్వ వైద్య విద్య!  

* ఐదు కొత్త బోధనాసుపత్రుల్లో సగం సీట్లు బి కేటగిరికి మళ్లింపు

* ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు ఇక కష్టాలే 

 

ఈనాడు-అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ యాజమాన్య కోటా రానుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2023 - 24) ఐదు జిల్లాల ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా మారుస్తున్నారు. వీటిల్లో ఎంబీబీఎస్‌లో 150 వంతున 750 సీట్లను కేటాయించాలని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ)కు అధికారులు దరఖాస్తు చేస్తున్నారు. ఈ కళాశాలల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ‘బి’ కేటగిరిని సృష్టించి సగం సీట్లను అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విద్యాలయాల్లో 325 సీట్లను మాత్రమే కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల జిల్లా ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా మార్చనున్నారు. మౌలిక వసతుల కల్పన, ఇతర ఏర్పాట్లు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయన్న ఉద్దేశంతో అనుమతి కోసం జాతీయ వైద్య కమిషన్‌కు దరఖాస్తు చేయనున్నారు. ఈ ఏడాది చివరలో ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీ చేసే అవకాశముంది. వీటిల్లో ‘బి’ కేటగిరి సీట్లను ఉన్నతవిద్య కమిషన్‌ నిర్దేశించిన ఫీజు మేరకు భర్తీ చేస్తారు.

మిగిలిన 11 వైద్య కళాశాలల్లోనూ బి కేటగిరీనే..!

ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎ, బి, సి కేటగిరిలలో సీట్లను భర్తీ చేస్తారు. ఎ కేటగిరిలో ప్రభుత్వ నిర్ణీత ఫీజు రూ.12,500, బి కేటగిరి కింద సుమారు రూ.13 లక్షలు, సి కేటగిరి సీటు ఇవ్వడానికి నిర్దేశిత ఫీజు తీసుకోవాలన్న నిబంధనలున్నాయి. 2,200 వరకు సీట్లున్న ప్రభుత్వ కళాశాలల్లో ఇప్పటివరకు కన్వీనర్‌ కోటానే ఉంది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 16 వైద్య కళాశాలల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. వీటిల్లో తొలి విడత 5 కళాశాలల్లో 2023 - 24 నుంచి ప్రవేశాలు చేపట్టేందుకు కసరత్తు కొనసాగుతోంది. బి కేటగిరి కింద భర్తీ చేపట్టనున్నారు. 16 వైద్య కళాశాలల ఏర్పాటుకు మొత్తంగా రూ.7,800 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఇందుకోసం తీసుకునే రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఇకనుంచి నిర్మించే అన్ని బోధనాసుపత్రుల్లో ‘బి’ కేటగిరి భర్తీ తెరపైకొచ్చింది. అలాగే ఆరోగ్యశ్రీ ట్రస్టు రోగులకు చికిత్సనందిస్తే వచ్చే ప్రభుత్వ చెల్లింపులు, నిర్ధారణ పరీక్ష ఫీజులు, అద్దెల కింద కొంత మొత్తం వసూలు చేయాలని భావిస్తున్నారు. స్థలం అందుబాటులో ఉంటే వాణిజ్య అవసరాలకు లీజుకివ్వాలని ఆలోచిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలకూ ఫీజు వసూలు చేయనున్నారు. ఇలాంటి సముపార్జన మార్గాలను చూపుతున్నప్పటికీ వాణిజ్య బ్యాంకులు రుణాలిచ్చేందుకు సంశయిస్తున్నట్లు సమాచారం. దీంతో కేంద్రాన్ని కూడా రాష్ట్రం ఆర్థికసాయం కోరుతోంది.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మళ్లీ అగ్రస్థానంలో ఐఐఎస్సీ

‣ సైన్స్‌ బోధనలో.. పరిశోధనలో!

‣ నీకు నువ్వు న‌చ్చ‌ట్లేదా?

‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం

‣ ఎక్కువ పరీక్షలు రాశా.. తప్పులు సరిచేసుకున్నా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.