కన్వీనర్ కోటాలో 62,100 సీట్ల భర్తీ
బీ కేటగిరీలోనూ 20 వేల మంది చేరిక!
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి బీటెక్‌లో చేరే వారి సంఖ్య బాగా పెరిగింది. ఒక్క కన్వీనర్ కోటా సీట్లలోనే గతేడాది కంటే 7 వేల మందికిపైగా ఎక్కువగా చేరినట్లు అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఎంసెట్ కన్వీనర్, యాజమాన్య కోటా కింద మొత్తం 82 వేలకుపైగా విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
‣ గత విద్యాసంవత్సరం (2021-22) వరకు కన్వీనర్ సీట్లలో 55 వేల లోపే చేరేవారు. అందులో 3, 4 వేల స్పాట్ ప్రవేశాలు ఉంటాయి. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 79,346 సీట్లు అందుబాటులో ఉండగా.. 62,100 (78.26 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. వాటిలో దాదాపు 4 వేల మంది స్పాట్ ప్రవేశాల్లో సీట్లు పొందారని ఎంసెట్ కన్వీనర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. బీ కేటగిరీ(యాజమాన్య కోటా) కింద ఏటా 14 వేల నుంచి 18 వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. ఈ సంవత్సరం 20 వేలకు పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందే అవకాశముందని ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి.
ఈసారి ఎందుకు పెరిగారంటే..
కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించిన ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి పలు కొత్త బ్రాంచీలు గత సంవత్సరమే కొన్ని కళాశాలల్లో అందుబాటులోకి వచ్చాయి. ఈసారి ఆ సంఖ్య బాగా పెరిగింది. డిమాండ్ లేని బ్రాంచీల స్థానంలో 9 వేలకుపైగా కొత్త బ్రాంచీల సీట్లు వచ్చాయి. విద్యార్థులు ఏ బ్రాంచి చదివినా మళ్లీ ఐటీ కొలువులకే వెళ్లాల్సి వస్తోంది. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ పూర్తిచేసిన వారికి ఉద్యోగాలు దక్కినా ప్రారంభ వేతనాలు తక్కువగా ఉంటున్నాయి. దీంతో సీఎస్ఈ తదితర బ్రాంచీల్లో చేరేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది.
ప్రైవేట్ వర్సిటీల్లో మరో 10 వేలు!
రాష్ట్రంలో ఇదివరకు అయిదు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉండగా.. ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి మరో అయిదింటికి ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో బిల్లు పాస్ అయిందన్న ఉద్దేశంతో గురునానక్, శ్రీనిధి యూనివర్సిటీలు ఈ ఏడాది ప్రవేశాలు జరిపాయి. మొత్తం ప్రైవేట్ వర్సిటీల్లో మరో 10 వేల మంది ప్రవేశాలు పొందారని అంచనా. గురునానక్, శ్రీనిధి వర్సిటీల్లో సుమారు 2,800 మంది విద్యార్థులు చేరినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ వర్సిటీల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకుంటే వారి పరిస్థితి ఏంటీ అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.