* మలి విడత తనిఖీల నాటికి సరిచేస్తాం
* అనుమతులివ్వాలని ఎన్‌ఎంసీకి వైద్య, ఆరోగ్య శాఖ అభ్యర్థన
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన అయిదు వైద్య కళాశాలల్లోని నాలుగింట్లో మార్గదర్శకాల ప్రకారం భవన నిర్మాణాలు, సౌకర్యాలు లేకపోవడంపై జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) వైద్య, ఆరోగ్య శాఖను సంజాయిషీ కోరింది. విజయనగరం, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాలల్లో 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్‌లో తరగతుల ప్రారంభానికి అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేసింది. ఎన్‌ఎంసీ బృందాలు కొద్దికాలం కిందట ఈ 5 కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాయి. అనంతరం విజయనగరం కళాశాలలో మాత్రమే తరగతుల ప్రారంభానికి ఎన్‌ఎంసీ అనుమతినిచ్చింది. ‘మిగిలిన కళాశాలల్లో నిర్మాణాలు, సౌకర్యాలు.. తరగతుల ప్రారంభానికి తగ్గట్లు లేవు. 2023-24 విద్యా సంవత్సరంలో తరగతుల ప్రారంభానికి తగ్గట్లు చర్యలు తీసుకోగలరా? లేదా? మీ విజ్ఞప్తిని ఎందుకు తిరస్కరించకూడదు’ అని సంజాయిషీ నోటీసులు పంపింది. దీంతో ఉన్నతాధికారులు రెండు రోజుల కిందట దిల్లీలో ఎన్‌ఎంసీ అధికారులను కలిసి ఆ లోపాలను సరిదిద్దుతున్నామని చెప్పారు. వచ్చే నెలాఖరులోగా కళాశాలల్లో మలి విడత తనిఖీకి ఎన్‌ఎంసీ బృందాలు రావొచ్చని భావిస్తున్నారు. నీట్ ఫలితాల వెల్లడి నాటికి ఈ కళాశాలల్లో ఎన్‌ఎంసీ మార్గదర్శకాలకు చర్యలు తీసుకుంటారని నమ్మకం కుదిరితేనే ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభానికి అనుమతులు లభిస్తాయి.
నియామకాలకు కనిపించని స్పందన
రాజమహేంద్రవరం, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం వైద్య కళాశాలల్లో సీనియర్ రెసిడెంట్స్ నియామకాలకు మార్చి 18న వాక్-ఇన్-ఇంటర్వ్యూలు జరిగాయి. విజయనగరంలో మాత్రమే అభ్యర్థుల నుంచి కాస్త స్పందన కనిపించింది. మిగతాచోట్ల స్పందన బాగా తక్కువగా ఉంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.