* పనులను వేగవంతం చేయండి
* సమీక్షలో మంత్రి హరీశ్‌రావు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త వైద్య కళాశాలల్లో జులై నాటికి తరగతులు ప్రారంభించేందుకు సిద్ధం కావాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. తొమ్మిది కొత్త వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్నారు. నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో స్థానికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుని పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచించారు. కొత్త వైద్య కళాశాలల్లో పనుల పురోగతిపై మంత్రి మంగళవారం జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు వేగంగా జరిగేందుకు సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, చొరవ చూపాలన్నారు. కళాశాలకు అవసరమైన ఫర్నిచర్, పరికరాలను సమకూర్చుకోవాలని, అన్ని సదుపాయాలతో కూడిన వసతిగృహాలు సిద్ధం చేయాలని సూచించారు.
* వైద్యవిద్యకు హబ్‌గా రాష్ట్రం
సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ వైద్యవిద్య విప్లవం దిశగా అడుగులు వేస్తోందని, వైద్యవిద్యకు హబ్‌గా మారుతోందని హరీశ్‌రావు అన్నారు. మారుమూల జిల్లాల్లో సైతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తున్న ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని అన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఒక నర్సింగ్ కాలేజీ విధానం ప్రకటించి దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. మంత్రులు సత్యవతి రాథోడ్, అజయ్‌కుమార్, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ కె.రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ కన్వీనర్ చంద్రశేఖర్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేలు, వైద్యాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.