• facebook
  • whatsapp
  • telegram

MLHP Jobs: పల్లెలకు కొత్త వైద్యులొస్తున్నారు!

* 1,492 మంది నియామకానికి ఆర్థిక శాఖ అనుమతి
* ఒప్పంద ప్రాతిపదికన భర్తీ
* నల్గొండలో అత్యధిక పోస్టులు

 

ఈనాడు, హైదరాబాద్‌: పల్లె దవాఖానాలకు కొత్త వైద్యులు రాబోతున్నారు. 1,492 మందిని ఒప్పంద ప్రాతిపదికన నియమించేందుకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ డిసెంబర్‌ 7న ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా నియామక ప్రక్రియను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేసేందుకు వైద్యారోగ్యశాఖ కసరత్తు ఆరంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 4,745 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. వీటిల్లో 3,206 సబ్‌ సెంటర్లను పల్లె దవాఖానాలుగా మార్చాలని వైద్యారోగ్యశాఖ ఇప్పటికే నిర్ణయించింది. వీటిలోనే కొత్తగా వైద్యులను నియమించనున్నారు. మరో 636 ఆరోగ్య ఉపకేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనే ఉండగా, వాటిల్లో ఇప్పటికే వైద్యులు అందుబాటులో ఉన్నారు. కొత్తగా భర్తీచేసే వారిని ‘మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ)’లుగా పిలుస్తారు. 

పల్లెల్లోనే సేవలు అందేలా
ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పట్టణాల్లో బస్తీ దవాఖానాలను నెలకొల్పడం ద్వారా పట్టణ ప్రజలకు వైద్యసేవలను చేరువచేసింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి పల్లె దవాఖానాలను సర్కారు ప్రవేశపెట్టింది. ప్రాథమిక స్థాయిలోనే వ్యాధి నిర్ధారణ చేసి, చికిత్స అందించడం వీటి ఏర్పాటు ఉద్దేశం. పైపెచ్చు అర్హతలేని వైద్యుల వద్దకు చికిత్సల కోసం వెళ్లి నష్టపోయే పరిస్థితులను నుంచి కూడా పల్లె ప్రజలను గట్టెక్కించవచ్చనేది ప్రభుత్వ భావన. జబ్బు తీవ్రమైన తర్వాత చికిత్స కంటే తొలి దశలోనే గుర్తించి ప్రాథమికంగా చికిత్స అందించడం ద్వారా రోగి ప్రాణాలను కాపాడడం, ఆర్థిక భారాన్ని తప్పించడం ప్రధాన లక్ష్యాలు. ‘పల్లె దవాఖానాల్లో అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలకు రక్త, మూత్ర నమూనాలను సేకరించి, సమీపంలోని తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ కేంద్రానికి పంపిస్తారు. 24 గంటల్లోగా అక్కడి నుంచి ఫలితాలు వెల్లడవుతాయి. వాటి ఆధారంగా స్థానికంగానే వైద్యసేవలు పొందడానికి గ్రామీణులకు మార్గం సుగమమవుతుంది’ అని వైద్య వర్గాలు తెలిపాయి.

నియామక మార్గదర్శకాలు
* ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేయడానికి ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌ అర్హత కలిగిన వైద్యులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంబీబీఎస్‌లకు ప్రాధాన్యం ఉంటుంది.
* ఎంబీబీఎస్‌/ బీఏఎంస్‌ వైద్యులు ముందుకు రానిపక్షంలో 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్‌ పట్టభద్రులు లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్‌/ జీఎన్‌ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో ఆరు నెలల బ్రిడ్జ్‌ కోర్సు పూర్తిచేసిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు.
* ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేసే ఎంబీబీఎస్‌/ బీఏఎంఎస్‌ వైద్యులకు నెలకు 40 వేలు, నర్సింగ్‌/ జీఎన్‌ఎంలకు నెలకు 29,900 చొప్పున గౌరవ వేతనాన్ని చెల్లిస్తారు.
* అర్హత వయసు 18-44 ఏళ్లుగా నిర్ణయించారు.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది. 
* ఎంబీబీఎస్, బీఏఎంఎస్, నర్సింగ్‌ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత మండళ్లలో తమ సమాచారాన్ని నమోదు చేసుకొని ఉండాలి.
* జిల్లా నియామక కమిటీ నేతృత్వంలో భర్తీ ప్రక్రియను నిర్వహిస్తారు. 

 

జిల్లాల వారీగా మంజూరైన కొత్త పోస్టులు
 

జిల్లా పోస్టులు
ఆదిలాబాద్‌ 21
భద్రాద్రి కొత్తగూడెం 69
హనుమకొండ 25
జగిత్యాల 47
జనగామ 38
జయశంకర్‌ భూపాలపల్లి 31
జోగులాంబ గద్వాల 34
కామారెడ్డి 34
కరీంనగర్‌ 41
కుమురం భీం ఆసిఫాబాద్‌ 26
ఖమ్మం 73
మహబూబాబాద్‌ 91
మహబూబ్‌నగర్‌ 57
మంచిర్యాల 60
మెదక్‌ 36
మేడ్చల్‌ మల్కాజిగిరి 28
ములుగు 22
నాగర్‌కర్నూల్‌ 52
నల్గొండ 110
నారాయణపేట 32
నిర్మల్‌ 39
నిజామాబాద్‌ 55
పెద్దపల్లి 31
రాజన్న సిరిసిల్ల 41
రంగారెడ్డి 50
సంగారెడ్డి 77
సిద్దిపేట 32
సూర్యాపేట 50
వికారాబాద్‌ 66
వనపర్తి 26
వరంగల్‌ 47
యాదాద్రి భువనగిరి 51 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.