• facebook
  • whatsapp
  • telegram

HCU: హెచ్‌సీయూలో జాతీయ విద్యావిధానం!

2022-23 నుంచి అమలుకు నిర్ణయం

విధివిధానాల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ విద్యావిధానాన్ని 2022-23 విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) నిర్ణయించింది. ఈ మేరకు అమలు చేయాల్సిన అంశాలు, విధివిధానాల అధ్యయనానికి వర్సిటీ ఉపకులపతి ప్రొ.బీజే రావు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. వర్సిటీలోని వివిధ విభాగాలకు చెందిన 12 మంది ఆచార్యులను కమిటీలో సభ్యులుగా నియమించారు. ఈ బృందానికి కమ్యూనికేషన్‌ విభాగాధిపతి ప్రొ.వినోద్‌ పావరాల నేతృత్వం వహించనున్నారు.

దేశంలో జాతీయ విద్యావిధానం అమలులోకి వచ్చి ఏడాది గడిచింది. ఇందులో సూచించిన ప్రకారం వర్సిటీ ఈ విద్యాసంవత్సరం నుంచి ఎంఫిల్‌ కోర్సులను రద్దు చేసింది. ఈ ఏడాది ప్రవేశాలు కల్పించలేదు. ప్రస్తుతం ఏర్పాటైన కమిటీ సభ్యులు.. ఆచార్యులు, విద్యార్థులు, ఇతర భాగస్వాములతో కలిసి కొత్త విద్యావిధానం అమలుకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. అనంతరం తొలిదశలో అమలు చేయాల్సిన విధివిధానాలను రూపొందించి వచ్చే మార్చి నాటికి ప్రతిపాదనలు సమర్పిస్తారు. అకడమిక్‌ కౌన్సిల్‌ సమావేశంలో వీటిపై చర్చించి ఆమోదిస్తారు.

విరామం తీసుకునేలా.. మళ్లీ చదువుకునేలా..

ఆయా కోర్సుల విద్యార్థులు మధ్యలో విరామం తీసుకుని, తిరిగి చదువుకునే అవకాశం కల్పించాలని జాతీయ విద్యా విధానం సూచిస్తోంది. ఇలాంటి విద్యార్థులకు డిగ్రీలు ఎలా ఇవ్వాలి? వారి స్థానంలో వేరొకరికి అవకాశం ఇవ్వొచ్చా? తిరిగి వచ్చే విద్యార్థులకు ప్రవేశం ఎలా కల్పించాలి? తదితర విషయాలపై కమిటీ సభ్యులు అధ్యయనం చేయనున్నారు. జాతీయ స్థాయిలో ఏర్పాటైన అకడమిక్‌ బ్యాంకు ఆఫ్‌ క్రెడిట్స్‌లో హెచ్‌సీయూ ఇప్పటికే రిజిస్టర్‌ చేసుకుంది. విద్యార్థులు కోర్సు మధ్యలో ప్రవేశాలు తీసుకుంటే క్రెడిట్లను బదిలీ చేయాల్సిన తీరును కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది. దశలవారీగా జాతీయ విద్యావిధానం అమలులోకి రానుందని, తొలి విడతలో అనుసరించాల్సిన విధానాలపై మార్చి నాటికి ప్రతిపాదనలు రూపొందిస్తామని కమిటీ ఛైర్మన్‌ ప్రొ.వినోద్‌ పావరాల ‘ఈనాడు’కు వివరించారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

కూడ గ‌డితే... సాయ‌ప‌డితే...

ఇండియ‌న్ ఆర్మీ-ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ  కోర్సు

ఏ పుస్తకాలు.. ఎంత మేలు?

ఎలా ఎంచుకోవాలి.. సరైన కెరియర్‌?

ఇంజినీరింగ్‌లోనూ...ఐఐటీ మద్రాస్‌ మేటి!

Posted Date : 26-10-2021