• facebook
  • whatsapp
  • telegram

NEET: నీట్‌ పారదర్శకతకు పాతర!

* పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలలో అనవసర గోప్యత

*  నీట్‌ గ్రేస్‌ మార్కులు కలపడంతో మరోసారి వివాదాస్పదం

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం నియమించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల సందర్భంగా పారదర్శకత పాటించకపోవడంతో ఏటా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తిప్పలు తప్పడం లేదు. ఏ వివరాలు బహిర్గతం చేయాలి, వేటి విషయంలో గోప్యత పాటించాలనే అంశంలో స్పష్టత లేని ఆ సంస్థ కారణంగా లక్షల మంది విద్యార్థులు  గందరగోళానికి గురవుతున్నారు. గతంలో అనేక పరీక్షల నిర్వహణలో విమర్శలు ఎదుర్కొన్న ఆ సంస్థ.. ప్రస్తుతం వివాదానికి కారణమైన నీట్‌ విషయంలోనూ అలాగే వ్యవహరించింది. నీట్‌ ఫలితాలను వెల్లడిస్తున్నట్లు కనీసం గంట ముందు కూడా అధికారికంగా ప్రకటించలేదు. తీరా ఫలితాలపై 20 పేజీల పత్రికా ప్రకటనను జారీ చేసిన ఎన్టీయే అందులో 1,563 మందికి గ్రేస్‌ మార్కులు కలిపామనే అంశాన్ని ప్రస్తావించకపోవడం సంస్థ విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మార్చింది.

సమయం ఇవ్వడానికి బదులు...

సాధారణంగా ప్రశ్నపత్రాలు అందజేయడం ఆలస్యమైతే నష్టపోయిన మేరకు సమయం ఇస్తారు. పరీక్ష ఏదైనా కొన్నేళ్లుగా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. మరి నీట్‌లో అదే విధానాన్ని ఎందుకు పాటించలేదనేది అందరూ ఎత్తిచూపుతున్న లోపం. విద్యార్థుల సమయం వృథా అయినందున వారికి గ్రేస్‌ మార్కులు ఇచ్చినట్టు ఎన్టీయే చెబుతోంది.
అదీ విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత మార్కులు కలిపినట్టు వెల్లడించింది. ఏ కారణంతో విద్యార్థుల సమయం వృథా అయింది, దానికి కారకులెవరు, ఏ రాష్ట్రంలో.. ఏఏ కేంద్రాల్లో ఎంత సమయం జాప్యం జరిగిందనే అంశాలను ఎన్టీయే ఇప్పటివరకూ వెల్లడించలేదు. కారణాలు ఏవైనా గ్రేస్‌ మార్కులు కలపడంతో కొందరు విద్యార్థులకు భారీగా మార్కులు వచ్చాయి. ‘సమయం నష్టపోయినందున బాధిత విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు ఇచ్చామని ఎన్టీయే వర్గాలు చెబుతున్నాయి. అలాంటి విధానం ఉందని ఇప్పుడే వింటున్నానని’ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేష్‌ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్‌గా పనిచేసిన ఆయన ఈ విషయమై ‘ఈనాడు’తో మాట్లాడుతూ..‘ఎంత సమయం నష్టపోయారో, అంతమేరకు సమయం పెంచి పరీక్ష రాయిస్తే సరిపోయేది. నిర్వహించే అన్ని పరీక్షల్లో మేము అలాగే చేస్తాం. జేఈఈలోనూ ఎన్టీయే ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. నీట్‌ విషయంలో అందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరించిందో అర్థం కావడం లేదు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘తాజాగా గ్రేస్‌ మార్కులు పొందిన 1,563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నారంటే గ్రేస్‌ మార్కుల విధానంలో లోపముందని అంగీకరించినట్లే కదా అని’ పరీక్షల నిర్వహణలో అనుభవమున్న మరో ఆచార్యుడు ప్రశ్నించారు. ‘కోర్టు చెప్పింది... కమిటీ వేశాం...మార్కులు ఇచ్చాం అన్నట్లు ఎన్టీయే వ్యవహరించింది’ అని శ్రీచైతన్య కళాశాలల డీన్‌ శంకర్‌రావు అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నాడు ఫలితాలు ఇస్తే లోపాలను ఎవరూ గమనించరన్నట్టుగా ఏజెన్సీ వ్యవహరించిందని ఆయన ఆక్షేపించారు. నానో అకాడమీ డైరెక్టర్‌ కాసుల కృష్ణ చైతన్య మాట్లాడుతూ, నీట్‌ ఫలితాల్లో కొన్ని అంశాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టాలని ఏజెన్సీ అనుకున్నట్లు కనిపిస్తోందన్నారు. 

తొలి నుంచి అదే తీరు

ఎన్టీయే ఏర్పాటైన 2017 నాటి నుంచి ఇదే తీరు. ఇది కేంద్ర విద్యాశాఖ కింద పనిచేస్తోంది. ఐఏఎస్‌ అధికారి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా నీట్, జేఈఈ మెయిన్స్‌తోపాటు పదుల సంఖ్యలో పరీక్షలను నిర్వహిస్తూ వస్తున్న ఈ సంస్థ ఏటా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ముప్పుతిప్పలు పెడుతూనే ఉంది. ఓ పరీక్ష జరగడానికి ముందు దానికి ఎంత మంది హాజరుకాబోతున్నారు, ఎన్ని కేంద్రాలున్నాయనే వివరాలనూ వెల్లడించాలి. ఎన్టీయే ఎప్పుడూ అలా చేయలేదు. ఉదాహరణకు గత ఏడాది జేఈఈ మెయిన్స్‌ తుది ‘కీ’ని వెల్లడించిన ఆ సంస్థ అయిదు రోజులపాటు స్కోర్‌ కార్డులు, ర్యాంకులను ప్రకటించకుండా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులను ఉత్కంఠకు గురిచేసింది. కనీసం ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని కూడా ప్రకటించలేదు. చివరకు ఆరో రోజు తెల్లవారుజామున ఫలితాలను విడుదల చేసింది. అధికారికంగా ఎంత మంది పరీక్షలు రాశారు, 100 పర్సంటైల్‌ సాధించిన వారు, టాప్‌ ర్యాంకర్లు, కేటగిరీ ర్యాంకర్లు తదితర వివరాలతో కూడిన సమాచారాన్ని సాయంత్రం 6 గంటల తర్వాత వెల్లడించింది.
తాజాగా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి జూన్‌ 12వ తేదీన దేశవ్యాప్తంగా నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎన్‌సీఈటీ) జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పరీక్షకు విద్యార్థులంతా హాజరయ్యారు. పలుచోట్ల మధ్యాహ్నం 3.40 గంటలకు కంప్యూటర్లన్నీ పనిచేయకుండా ఆగిపోవడంతో అర్ధంతరంగా పరీక్షను వాయిదా వేశారు. వారం గడిచినా ఇప్పటివరకు కొత్త తేదీని ప్రకటించలేదు. 

అన్నీ అనుమానాలే

సాధారణంగా కొన్నిసార్లు ఒకరిద్దరికి ఒకే ర్యాంకు వస్తుంది. ఎన్టీయే మాత్రం ఈసారి నీట్‌లో ఏకంగా 67 మందికి తొలి ర్యాంకు వచ్చినట్లు ప్రకటించింది. అనుమానంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యార్థులు రోడ్డెక్కారు. దాంతో హరియాణా, ఉత్తర భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో సకాలంలో ప్రశ్నపత్రాలు ఇవ్వలేని కారణంగా విద్యార్థులు సమయాన్ని కోల్పోయారని, అందుకే 1,563 మందికి గ్రేస్‌ మార్కులు ఇచ్చామని ప్రకటించింది. వాస్తవంగా ఫలితాల నాడే ఆ విషయం ప్రకటించి ఉంటే కొంతలో కొంత ఎన్టీయేపై నమ్మకం పెరిగేది. అందుకు భిన్నంగా ఆ సంస్థ ఆ విషయాన్ని బహిర్గతం చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లౌడ్‌ కంప్యూటర్‌లో ఉద్యోగాల మథనం

‣ డిజిటల్‌ బిజినెస్‌ కోర్సులో అడ్మిషన్లు

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌

‣ బైపీసీ తీసుకుంటే.. కెరియర్‌ అవ‌కాశాలివే!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.