• facebook
  • whatsapp
  • telegram

NICE Institute: అక్షర కోవెలలో అనురాగ పాఠాలు!

* అనాథలను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతున్న ‘నైస్‌’

* కొత్త విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఆహ్వానం

నరసరావుపేట టౌన్‌, నాదెండ్ల, న్యూస్‌టుడే: అదొక విద్యాలయం. అమ్మలోని ప్రేమ, నాన్నలోని బాధ్యతను పంచి విద్యార్థుల భవితకు పునాది వేస్తోంది. వీధి బాలలను అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పిస్తోంది. ఉన్నత శిఖరాలకు చేర్చేలా మార్గనిర్దేశం చేస్తోంది. దాతల సాయంతో రెండు దశాబ్దాలుగా ఎందరో చిన్నారులను తీర్చిదిద్దుతోంది. అనాథల జీవితంలో అనురాగ వెలుగులు ప్రసరింపజేస్తున్న ఈ పాఠశాలే.. నైస్‌ విద్యాసంస్థ. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మైనంపాడులో కొలువైన ఈ విద్యా కోవెల వచ్చే ఏడాది కోసం విద్యార్థులను ఆహ్వానిస్తోంది. జీవితమనే నావకు చదువే చుక్కాని అని నమ్మిన పోపూరి పూర్ణచంద్రరావు నైస్‌ విద్యాసంస్థ నెలకొల్పారు. విద్యా గంధంతో వీధి బాలలు, అనాథలను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దాలని 2003 ఆగస్టు 15న దీన్ని ప్రారంభించారు. 21 ఏళ్లలో వందల మంది పిల్లలకు విద్యనందించారు. ప్రస్తుతం 155 మంది బాలురు, 43 మంది బాలికలు ఉన్నారు. సీబీఎస్‌ఈ సిలబస్‌లో విద్యాబోధన చేయిస్తున్నారు. బాల, బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు, కంప్యూటర్‌, సైన్స్‌, గణితం ల్యాబ్స్‌తోపాటు ఇక్కడున్న గ్రంథాలయం 4 వేల పుస్తకాలతో విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పిల్లలు కట్టుబట్టలతో బడిలో చేరితే సరి.. సకల సౌకర్యాలూ సంస్థే కల్పిస్తోంది. ఏకరూప దుస్తులు, భోజనం, పుస్తకాలు, వసతి సదుపాయాలన్నీ ఉచితమే. ఒక్క చదువే కాకుండా.. సువిశాల మైదానంలో బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, టెన్నిస్‌, కబడ్డీ శిక్షణ ఇస్తున్నారు. ఇండోర్‌ గేమ్స్‌లోనూ పిల్లలు రాణించేలా చేస్తున్నారు.

ప్రవేశాలు ఇలా..

పాఠశాలలో 5, 6 తరగతుల విద్యార్థులను చేర్చుకుంటారు. ఈ ఏడాది రెండు తరగతుల్లో మొత్తం 60 మందికి ప్రవేశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకు మే నెల మూడో ఆదివారం, జూన్‌ మొదటి ఆదివారం పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పదేళ్లు దాటిన విద్యార్థులు ఏప్రిల్‌ 23 నుంచి ప్రవేశ పరీక్షలు నిర్వహించేలోగా బడిలో దరఖాస్తు చేసుకోవాలి. తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన వారికి తర్వాతి ప్రాధాన్యం ఇస్తారు. వివరాలకు 98660 34579, 89851 89232 ఫోన్‌ నంబర్లలో సంప్రదించొచ్చు.

ఉన్నత విద్య వరకు పర్యవేక్షిస్తున్నాం

దాతల సాయంతో పాఠశాల విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించి ఆ దిశగా వారికి మార్గనిర్దేశం చేస్తున్నాం. ఇక్కడ ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు బోధిస్తున్నాం. ఇంటర్‌, డిగ్రీ, పీజీలు పూర్తయ్యే వరకూ పర్యవేక్షిస్తున్నాం. అనాథ పిల్లలను చేర్పించేందుకు మా పాఠశాల కార్యాలయంలో సంప్రదించాలి.   - పోపూరి పూర్ణచంద్రరావు, వ్యవస్థాపకుడు

సౌకర్యాలు బాగున్నాయి..

మాది బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం తంగెడుమల్లి. చిన్నతనంలోనే అమ్మ గుండెపోటుతో మృతి చెందారు. నాన్న శ్రీనివాసరావు వ్యవసాయ పనులు చేస్తారు. ఆరేళ్ల నుంచి ‘నైస్‌’లో చదువుతున్నా. ఇక్కడ ఆహారం, వసతి సౌకర్యాలు బాగున్నాయి. అమ్మ లేదన్న దిగులు ఏ రోజూ అనిపించలేదు. సమాజంలో విలువలతో ఎలా జీవించాలన్నది ఇక్కడ నేర్చుకున్నా. పదో తరగతి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తానన్న నమ్మకం పెరిగింది.    - ఎం.పవన్‌ సాయి మణికంఠ, పదో తరగతి
 

బడంటే ఎంతో ఇష్టం

మాది ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం అమనిగుడిపాడు. నాన్న వెంకటచలమయ్య గుండెపోటుతో మృతి చెందారు. అమ్మ రాధిక నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు. నాన్న మృతితో మా కుటుంబ జరుగుబాటు కష్టమైంది. అమ్మ ‘నైస్‌’లో చేర్పించారు. ఆరేళ్లుగా ఇక్కడే చదువుతున్నా. సొంత ఇంటి కంటే ఎక్కువగా పాఠశాలను ఇష్టపడుతున్నాం.  - వడ్లమూడి అర్షిత, పదో తరగతి

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐఐటీలో న్యాయవిద్య

‣ భవిష్యత్తు శాస్త్రవేత్తలకు, ప్రొఫెసర్లకు నెట్‌!

‣ కాలుష్య నియంత్రణ బోర్డులో కొలువులు

‣ అమెరికాలో అడ్వాన్స్‌డ్‌ కోర్సులు ఇవే!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.