అందుబాటులోకి రాని 884 కొత్త జూనియర్ కళాశాలలు
లెక్చరర్ల నియామకాల్లోనూ స్పష్టత కరవు
నేటి నుంచి ఇంటర్ విద్యాసంస్థల పునఃప్రారంభం
ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ విద్యపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఉచిత పాఠ్యపుస్తకాల నుంచి కొత్త కళాశాలల ఏర్పాటు, లెక్చరర్ల నియామకాల వరకు అంతా అస్తవ్యస్తంగా తయారైంది. జూనియర్ కళాశాలలు శుక్రవారం నుంచి పునఃప్రారంభం అవుతున్నా ఇంతవరకు ఇంటర్మీడియట్ ఉచిత పాఠ్యపుస్తకాల ముద్రణే ప్రారంభం కాలేదు. ఇప్పుడు మొదలుపెట్టినా పుస్తకాలు కళాశాలలకు అందేసరికి రెండు నెలలు పడుతుంది. అప్పటివరకు సీనియర్ల నుంచి తీసుకునే పాత పుస్తకాలతోనే చదువుకోవాలి. మండలానికో జూనియర్ కళాశాల, అమ్మాయిలకు ప్రత్యేకంగా మరో కళాశాల ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 131 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)లను ఉన్నతీకరించి, వీటిలో ఇంటర్మీడియట్ ప్రారంభించారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండానే విద్యార్థుల సంఖ్యను పెంచేశారు. ఒక్కో కేజీబీవీలో ఒక్కో కోర్సు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 352 కేజీబీవీల్లోనూ ఇంటర్మీడియట్ ప్రారంభమైంది. వీటిలో ప్రవేశాలు పొందేవారికి పాఠ్యపుస్తకాలను ఇంటర్ విద్యాశాఖే అందించాలి. ఇవికాకుండా ఆదర్శ పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో కొత్తగా ఏర్పాటుచేయనున్న 884 జూనియర్ కళాశాలలకు పుస్తకాలు ఇవ్వాలి.
కొత్తవి వస్తాయా?
ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో 884 కొత్త జూనియర్ కళాశాలలను ఏర్పాటుచేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల ప్రకటించారు. జులై 1 నుంచి విద్యాసంవత్సరం పునఃప్రారంభమవుతున్నా ఇంతవరకు కొత్త కళాశాలలు అందుబాటులోకి రాలేదు. అమ్మాయిల కోసమే 292 కళాశాలలను కొత్తగా ప్రారంభించాలి. ఇప్పటికైతే ఇవన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయి. దీంతో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కళాశాలల్లో చేరేందుకు వేచి చూడాలా? లేదంటే వేరే కళాశాలల్లో చేరాలా.. అనేదానిపై అయోమయం నెలకొంది. ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ప్రారంభిస్తున్నందున పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి టీసీలు ఇవ్వొద్దని కొన్నిచోట్ల అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. ఇలాంటిచోట కొత్తవి ప్రారంభించక.. వేరే చోటుకు వెళ్లేందుకు టీసీలు ఇవ్వకపోతే విద్యార్థుల పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ విద్యామండలి ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రైవేటు కళాశాలలు దాదాపు ప్రవేశాలు పూర్తి చేసేశాయి. ఈ ఏడాది పదో తరగతిలో 67% మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. దీంతో కళాశాలలు ఆలస్యంగా ప్రారంభిస్తే సీట్లు నిండుతాయా? అనే అనుమానాలను విద్యావేత్తలు వ్యక్తం చేస్తున్నారు.
లెక్చరర్లు ఎక్కడ?
రాష్ట్రంలో ఒకేసారి 884 కళాశాలలను ప్రారంభిస్తామని ప్రకటించినా వీటికి లెక్చరర్ల నియామకాలకు ఇంతవరకూ చర్యలు చేపట్టలేదు. పాఠశాల విద్యలోని స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తామని చెబుతున్నారు. పాఠశాల విద్యలో ఇప్పటి వరకు హేతుబద్ధీకరణే పూర్తికాలేదు. కళాశాలల ఏర్పాటు, లెక్చరర్ల నియామకాలు, విద్యార్థుల ప్రవేశాలు ఎప్పటికి పూర్తి చేస్తారో అధికారులకే తెలియాలి.
‣ ఇప్పటికే 84 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రభుత్వం పోస్టులే ఇవ్వలేదు. వీటిని ఒప్పంద లెక్చరర్లతో నిర్వహిస్తున్నారు.
‣ రాష్ట్రవ్యాప్తంగా 200 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి ఇన్‌ఛార్జిలతోనే కొనసాగుతున్నాయి.
‣ 6-10 తరగతుల కోసం ఏర్పాటు చేసిన కేజీబీవీల్లో అదనపు నిర్మాణాలు చేపట్టకుండానే ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టారు. అమ్మాయిలకు వసతి, బోధనకు ప్రత్యేక తరగతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకే గదిలో తరగతి, వసతి కల్పిస్తున్నారు. బోధన సమయంలో గదిలోని పెట్టెలను పక్కకు జరిపి, తరగతులు వింటున్నారు. రాత్రి అక్కడే నిద్రిస్తున్నారు. అదనపు తరగతి గదులకు చాలాచోట్ల గత ప్రభుత్వంలోనే నిధులు మంజూరైనా ఇప్పటికీ పూర్తిచేయలేదు.
‣ ఆదర్శ పాఠశాలల్లోని ఇంటర్లో సెక్షన్‌కు 20 మంది ఉండగా.. దీన్ని 40మందికి పెంచారు. వీటిలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ మూడు గ్రూపులను నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ అధ్యాపకుల కొరత ఉండటంతో ఒప్పంద సిబ్బందితో నెట్టుకొస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.