• facebook
  • whatsapp
  • telegram

NEET: నీట్‌లో రిజర్వేషన్లు వద్దంటూ వ్యాజ్యం

దిల్లీ: నీట్‌లో రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు సెప్టెంబరు 17న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌)లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని తప్పు పడుతూ ఎనిమిది మంది ఈ దావా వేశారు. దీనిని న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ)కు కూడా నోటీసు ఇచ్చింది. ఈ విషయమై ఇప్పటికే దాఖలైన దావాలతో కలిపి దీన్ని విచారించనుంది. అండర్‌ గ్రాడ్యుయేట్, డెంటల్‌ కోర్సులతో పాటు, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లోనూ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రకటన ఇచ్చారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేక్‌ సింగ్‌ తెలిపారు. పీజీ మెడికల్‌ కోర్సుల్లో రిజర్వేషన్ల విషయమై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ కారణంగా పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో జనరల్‌ కేటగిరీ విద్యార్థులు చాలా స్పల్పమైన మైనార్టీలుగా మిగిలిపోతారని తెలిపారు. ప్రతిభావంతులకు అవకాశాలు నిరాకరించడమే అవుతుందని పేర్కొన్నారు.

Posted Date : 18-09-2021