* గత టీఆర్‌టీకి భిన్నంగా ఈసారి ఉపాధ్యాయ నియామకాలు
* ఆ జిల్లాను అభ్యర్థులు ముందే ఎంపిక చేసుకోవాలి
ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాల్లో ఈసారి కీలక మార్పు జరగనుంది. స్థానికేతర కోటా కింద ఏదైనా ఒక జిల్లాను మాత్రమే అభ్యర్థులు ముందే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. గత టీఆర్‌టీలో 10 ఉమ్మడి జిల్లాల్లోని కొలువులకు స్థానికేతర కోటా కింద మిగతా జిల్లాలవారు పోటీపడేందుకు అవకాశం కల్పించారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఏదైనా ఒక జిల్లాను మాత్రమే స్థానికేతర కోటా కింద ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా స్థానికేతర కోటా కింద కొలువులు దక్కించుకోవడం అంత సులభమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. దీనిపై విద్యాశాఖ వర్గాలను సంప్రదించగా.. 2017 జులైలో టీఎస్‌పీఎస్‌సీ నియామకాలు చేపట్టినందువల్ల ఆ విధానం పాటించిందని, ఈసారి పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందువల్ల ఆ పద్ధతిలో మార్పు ఉంటుందని తెలిపాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ 2012 వరకు నిర్వహించిన డీఎస్‌సీల్లో ఏదైనా ఒక జిల్లాకు మాత్రమే స్థానికేతర అర్హత ఉండేదని గుర్తుచేస్తున్నారు.
2017లో అలా.. ఈసారి ఇలా..
2017 జులైలో నిర్వహించిన టీఆర్‌టీలో స్థానికేతర (నాన్‌లోకల్) కోటా కింద అభ్యర్థులకు సొంత జిల్లా మినహా మిగతా జిల్లాల్లోని 20 శాతం పోస్టులకు పోటీపడే అవకాశం కల్పించారు. ఆ టీఆర్‌టీలో మొత్తం 5,415 ఎస్‌జీటీ కొలువులకు నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 20 శాతం అంటే 1,083 పోస్టులకు నాన్ లోకల్ కోటా వర్తింపజేశారు. సొంత జిల్లాలో తక్కువ పోస్టులు ఉన్నవారు ఎక్కువ ఖాళీలున్న జిల్లాల నుంచి పోటీ పడ్డారు. టీఆర్‌టీలో వచ్చిన రాష్ట్ర ర్యాంకు ఆధారంగా జిల్లాల వారీగా ప్రాధాన్యం ఇచ్చుకున్నారు. ఈసారి మాత్రం స్థానిక జిల్లాతో పాటు.. ఏదో ఒక్క జిల్లాకు మాత్రమే స్థానికేతర కోటా కింద ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. టీఆర్‌టీ దరఖాస్తు సమయంలోనే ఏ సబ్జెక్టుకు లేదా పోస్టుకు పోటీపడుతున్నారనే వివరాలు తీసుకుంటారు. ఎంపిక చేసుకున్న జిల్లాలోని ఖాళీలకే అభ్యర్థులు పోటీపడాలి. ఈసారి స్థానిక కోటా 95 శాతం కాగా.. స్థానికేతర కోటా(ఓపెన్) 5 శాతం మాత్రమే ఉంటుంది. జిల్లాను యూనిట్‌గా తీసుకుంటారు కాబట్టి స్థానికేతర కోటా కింద అతి స్వల్పంగా మాత్రమే ఖాళీలు వస్తాయి. ఎస్జీటీ పోస్టుల్లో స్థానికేతర కోటా కింద కొన్ని పోస్టులైనా ఉండే అవకాశం ఉంది. కానీ, స్కూల్ అసిస్టెంట్‌లకు సబ్జెక్టుల వారీగా స్థానిక, స్థానికేతర కోటా ఉంటుంది. అందువల్ల అధిక శాతం జిల్లాలు, సబ్జెక్టులకు స్థానికేతర కోటా కింద ఖాళీలు ఉండే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣నెహ్రూ గ్రామ భారతి వర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
‣డాక్టర్ వైఎస్సార్ యూహెచ్‌ఎస్‌లో బీఎస్సీ (నర్సింగ్) కోర్సు
‣ఎన్‌హెచ్‌ఐటీలో 51 వివిధ పోస్టులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.